ITR Filing For FY24: 2023-24 ఆర్థిక సంవత్సరానికి (FY 2023-24) ఆదాయ పన్ను పత్రాలను దాఖలు చేయడానికి ఈ ఏడాది (2024) జులై 31తోనే గడువు ముగిసింది. ఆ తేదీలోగా ఐటీఆర్ ఫైల్ చేయడం మరిచిపోయినా/ కుదరకపోయిన వాళ్లు లేదా దాఖలు చేసిన రిటర్న్‌లో ఏదైనా దిద్దుబాటు ఉన్నవాళ్లు… బీలేటెడ్ ఐటీఆర్ (Belated ITR) లేదా రివైజ్డ్ ఐటీఆర్ (Revised ITR) చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు తుది గడువు (ITR Deadline) ఉంది.
బీలేటెడ్ ఐటీఆర్ విషయంలో.. డిసెంబర్ 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు గరిష్టంగా రూ. 5,000 వరకు లేట్ ఫీజ్ చెల్లించాలి. మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేనప్పటికీ, ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేస్తున్నందుకు ఈ పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒకసారి సమర్పించిన ఆదాయ పత్రాలకు సవరణలు చేసి రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేవాళ్లు కూడా డిసెంబర్ 31లోగా ఆ పని పూర్తి చేయాలి.
గడువును మరచిపోతే ఏంటి నష్టం?
అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం లేదా పొరపాటున మీరు డిసెంబర్ 31 గడువును మరచిపోతే, మీరు దానికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మొదటి విషయం, మీరు ఈ డెడ్‌లైన్‌ను మిస్ చేసి, ఆ తర్వాత ఇన్కమ్ టాక్స్ రిటర్న్‌ను దాఖలు చేసినప్పటికీ అన్ని రకాల రీఫండ్లను కోల్పోతారు. డిసెంబర్ 31 తర్వాత మీరు అప్డేట్ చేసిన రిటర్న్‌ను (Updated ITR) ఫైల్ చేయవచ్చు, దీని ద్వారా మీరు మీ పన్ను బాధ్యత (Tax liability)ను చెల్లిస్తున్నరాని మాత్రమే పేర్కొనాలి. రిఫండ్‌ను కోల్పోవడంతో పాటు పన్ను (ఏవైనా ఉంటే), జరిమానా, పెనాల్టీని కూడా చెల్లించాలి.
అదనపు నష్టాలు
డిసెంబర్ 31 గడువును మిస్ చేస్తే ఇంకా ఇతర ప్రతికూలతలు కూడా ఉన్నాయి. పన్ను చెల్లింపుదారు పాత పన్ను విధానాన్ని (Old tax regime) ఎంచుకోలేరు. ఆలస్యంగా దాఖలు చేసే రిటర్న్‌లను కొత్త పన్ను విధానం (Nld tax regime)లో మాత్రమే ఫైల్ చేయాలి. కొత్త పన్ను విధానంలో అందుబాటులో లేని చాలా రకాల తగ్గింపులు & మినహాయింపులు పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్నాయి. ఈ తగ్గింపులు & మినహాయింపులు (Deductions & Exemptions) పన్ను చెల్లింపుదారు ‘పన్ను విధించదగిన ఆదాయాన్ని’ చాలా వరకు తగ్గించడంలో సాయపడతాయి. కొత్త పన్ను విధానంలో ఆదాయ పన్ను పత్రాలను సమర్పించాల్సి రావడం వల్ల టాక్స్ పేయర్ ఈ ప్రయోజనాలన్నీ కోల్పోతాడు.
రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్లు 7% కూడా లేరు
ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నవాళ్లు దేశ జనాభాలో కనీసం 7% మంది కూడా లేరు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, మన దేశ జనాభా మొత్తంలో కేవలం 6.68% మంది మాత్రమే రిటర్న్స్ ఫైల్ చేశారు. దీనిని ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, దాదాపు 145 కోట్ల భారతదేశ జనాభాలో కేవలం 8 కోట్ల మంది (8,09,03,315) మాత్రమే ఆదాయ పన్ను పత్రాలు సమర్పించాలి. ఇంకో విషయం ఏంటంటే.. వీళ్లలో దాదాపు 4.90 కోట్ల మంది ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదు. అంటే, పన్ను చెల్లించిన వాళ్లు 3.19 కోట్ల మంది మాత్రమే. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌధ్రీ, ఈ విషయాన్ని గత మంగళవారం (17 డిసెంబర్ 2024) నాడు పార్లమెంటులో వెల్లడించారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.40 కోట్ల రిటర్న్‌లు, 2021-22లో 6.96 కోట్లు, 2020-21లో 6.72 కోట్లు, 2019-20లో 6.48 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు పంకజ్ ఛౌధ్రీ చెప్పారు.
మరో ఆసక్తికర కథనం: రూ.78 వేల దగ్గర బంగారం, రూ.99 వేల దగ్గర వెండి – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ