GST Rate Hike: కొత్త సంవత్సరంలో సామాన్య జనానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. ప్రజలు ప్రతిరోజూ వినియోగించే వివిధ ఉత్పత్తులపై పన్నులు పెంచేందుకు రంగం సిద్ధమైంది, ఫలితంగా ఆయా ఉత్పత్తుల రేట్లు పెరుగుతాయి. ముఖ్యంగా.. సిగరెట్లు (Cigarettes), పొగాకు ఉత్పత్తులు (Tobacco Products), శీతల పానీయాల (Cold Drinks) వినియోగం జేబుకు భారంగా మారుతుంది. జీఎస్‌టీ రేట్లను (GST Rates) హేతుబద్ధీకరించడానికి ఏర్పాటైన మంత్రుల బృందం (Group Of Ministers), ఈ ఉత్పత్తులపై జీఎస్‌టీ రేట్లను పెంచాలని సిఫార్సు చేసింది. ఈ నెల 21వ తేదీన (21 డిసెంబర్ 2024), రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జీఎస్‌టి కౌన్సిల్ (GST Council) 55వ సమావేశం జరుగుతుంది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలపై పన్ను పోటుపై ఆ భేటీలో తుది నిర్ణయం తీసుకోవచ్చు.
సిగరెట్లు, పొగాకుపై టాక్స్ రేటు పెంపు!
రేట్లను హేతుబద్ధీకరించేందుకు, జీఎస్టీ కౌన్సిల్, బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అధ్యక్షతన మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసింది. పరస్పర అంగీకారం తర్వాత, ఎరేటెడ్ బేవరేజెస్ (శీతల పానీయాలు)తో పాటు సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై జీఎస్‌టి రేటును 35 శాతానికి పెంచాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. ఇది ప్రస్తుతం 28 శాతంగా ఉంది.
మరో ఆసక్తికర కథనం: గుండె జబ్బు చికిత్సల బీమా క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి కారణాలివే!, ముందే అలెర్ట్ కావడం మంచిది
దుస్తులు మరింత ఖరీదు!
దుస్తులపైనా జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. 1500 రూపాయల వరకు ఉన్న వస్త్రాలపై 5 శాతం జీఎస్‌టీ రేటును GoM కొనసాగించింది. అయితే, రూ. 1500 నుంచి రూ. 10,000 మధ్య ధర ఉన్న వస్త్రాలపై 18 శాతం జీఎస్టీ, రూ. 10 వేల కంటే ఎక్కువ ధర ఉన్న వస్త్రాలపై 28 శాతం జీఎస్టీ విధించాలని ప్రతిపాదించింది. అంటే.. రూ. 10,000 కంటే ఎక్కువ ఖరీదు చేసే దుస్తులు కూడా లగ్జరీ వస్తువుల కేటగిరీలోకి వస్తాయి. సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని కమిటీ మొత్తం 148 వస్తువులపై జీఎస్టీ రేట్లను సవరించాలని సూచించింది. జీఎస్టీ రేటు మార్పు ప్రభావం ప్రభుత్వ ఆదాయంపై సానుకూలంగా ఉంటుందని ఓ అధికారి చెప్పారు.
జీఎస్టీ కౌన్సిల్‌లో తుది నిర్ణయం
ప్రస్తుతం, నాలుగు శ్లాబులుగా జీఎస్టీ రేట్లు అమల్లో ఉన్నాయి. అవి.. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. ఈ శ్లాబుల్లో ఎలాంటి మార్పుచేర్పులు లేకుండా భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. మంత్రుల బృందం కొత్తగా 35 శాతం జీఎస్‌టీ రేటును ప్రతిపాదించింది. డిసెంబరు 21న, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రుల బృందం సిఫార్సులపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.
మరో ఆసక్తికర కథనం: పెరిగిన 24K, 22K పసిడి రేట్లు – ఈ రోజు బంగారం, వెండి తాజా ధరలు ఇవీ
మరిన్ని చూడండి