Homeస్పెషల్ స్టోరీఅమెరికాలో హెలీన్ విలయానికి 95 మంది మృత్యువాత-ఇంకా అంధకారంలోనే లక్షలాది ఇళ్లు

అమెరికాలో హెలీన్ విలయానికి 95 మంది మృత్యువాత-ఇంకా అంధకారంలోనే లక్షలాది ఇళ్లు


Helene News: గత గురువారం ఫ్లోరిడా పరిధి బిగ్‌బెండ్‌ దగ్గర హెలీన్ హరికేన్ తీరం దాటింది. ఆ తర్వాత కూడా దాని విలయం కొనసాగుతుండగా యూఎస్‌లోని నార్త్ కరోలినా, సౌత్‌ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, వర్జీనియా, టెనెస్సీ రాష్ట్రాలు ఇంకా కోలుకోనే లేదు. హెలీన్ జలఖడ్గం ధాటికి ఇప్పటి వరకూ ఈ ఆరు రాష్ట్రాల్లో మరణించిన వారి సంఖ్య 95కి చేరింది. భారీ వరదల్లో చిక్కుకున్న వేలాది మంది సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించాల్సి ఉంది. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటించనున్నారు.

ఆ ఆరు రాష్ట్రాల్లో పరిస్థితి అస్తవ్యస్థం:

దక్షిణ కరోలినా, ఉత్తర కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, వర్జీనియా, టెన్నెస్సీ రాష్ట్రాలు హెలీన్ తీరం దాటి ఐదు రోజులు గడుస్తున్నా ఇంకా కోలుకోలేదు. ఆ రాష్ట్రాల్లో హెలీన్ సృష్టించిన విలయానికి ఇప్పటి వరకూ 95 మంది మృత్యువాత పడ్డారు. దక్షిణ కరోలినాలో ఇద్దరు విపత్తు నిర్వహణ సిబ్బంది సహా 25 మందికి పైగా మృత్యువాత పడినట్లు అధికారులు పేర్కొన్నారు. జార్జియాలో 17 మంది మృత్యువాత పడగా అందులో ఇద్దర్ని అలమో ప్రాంతంలో సంభవించిన టోర్నడో పొట్టన పెట్టుకుంది. ఫ్లోరిడాలో 11 మంది మృత్యువాత పడగా.. ఇంకా ఎంతో మంది వరదల్లో గల్లంతైనట్లు ఆ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం తెలిపింది. వర్జీనియాలో ఇద్దరు, టెనెస్సిలో నలుగురు మృత్యువాత పడ్డారు.  నార్త్ కరోలినా బన్‌కోంబ్ కౌంటీ ప్రాంతంలోనే వరదల్లో 600 మంది కొట్టుకుపోయినట్లు సమాచారం అందగా 30 మంది మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు వివరించారు. వారిని కాపాడేందుకు సహాయ చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆరు రాష్ట్రాల పరిధిలో వందల రోడ్లు ధ్వంసం:

భారీ వరదలు, కొండచరియలు విరిగిపడి ఈ ఆరు రాష్ట్రాల పరిధిలో వందలాది రోడ్లు మూత పడ్డాయి. ఉత్తర కరోలినాలో 300 రోడ్లు, దక్షిణ కరోలినానలో 150 రోడ్లు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కారణంగా ఉత్తర కరోలినాలో వేలాది మందికి మంచి నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. ఆగ్నేయ అమెరికాలో హెలీన్ బీభత్సానికి ఇప్పటికీ లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు.

దాదాపు 21 లక్షల గృహాలు, వాణిజ్య సముదాయాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. శుక్రవారానికి అన్ని ఇళ్లకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ పర్యటించి సహాయచర్యలు పర్యవేక్షిస్తారని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. ఈ వారాంతంలో ఆయన పర్యటన ఉండనుంది. జార్జియా గవర్నర్ సహా ఇతర ప్రాంతాల అధికారులతో ఆదివారం బైడెన్ మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు.

హరికేన్‌ కేటగిరీ 4 హెలీన్ తీరం దాటిన ఫ్లోరిడాలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫెడరల్ ఏజెన్సీలు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. భారీగా వైద్య సిబ్బంది, మెడిసిన్ సహా నిత్యావసరాలను ఆ ప్రాంతాలకు తరలించారు. వరదల నుంచి బయటపడిన చోట్ల విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించక పోవడంతో ఇళ్లను శుభ్రం చేసుకోవడం చాలా కష్టంగా మారిందని బాధితులు చెబుతున్నారు. హెలీన్ ధాటికి అంచనా వేసిన వర్షపాతం కంటే కొన్నిప్రాంతాల్లో రెండు ఇంచెస్‌ ఎక్కువగా వర్షం కురవడంతో ఈ పరిస్థితి ఎదురైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: నేపాల్‌లో వరుణుడి బీభత్సానికి 170మందికిపైగా బలి-ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలం

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments