తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు మంత్రులుగా ఎవరు ప్రమాణం చేస్తారనే విషయంలో మాత్రం ఇంత వరకు క్లారిటీ రాలేదు. అసలు ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు కూడా అ దిశగా అందలేదని చెబుతున్నారు. ఎవరెవరికి మొదటి జాబితాలో ఉంటారనే ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీలో ఉంది.
తెలంగాణ సీనియర్లైన మల్లు భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, సీతక్క, శ్రీధర్ బాబు పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. వారికి శాఖలు కూడా కేటాయించేసినట్టు కూడా ప్రచారం నడుస్తోంది. అయితే ఇంత వరకు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కాల్ రాలేదని చెబుతున్నారు .
సీనియర్లుగా ఉన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్, దామోదర్ రాజనర్సింహా లాంటి వారికి ప్రాధాన్యత ఉన్న శాఖలే దక్కుతాయని అంటున్నారు. భట్టి విక్రమార్కకు రెవెన్యూ ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తూనే ఈ రెవెన్యూ శాఖ ఇస్తారని సమాచారం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆర్థిక శాఖ కట్టబెడతారని అంటున్నారు. ఆర్థిక శాఖ శ్రీధర్ బాబుకు కూడా ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదట ఆయనకు స్పీకర్ పదవి ఇస్తారని అనుకున్నారట అయితే దానికి ఆయన అంగీకరించకపోవడంతో ప్లాన్ మారినట్టు చెబుతున్నారు.
ప్రమాణ స్వీకారం విషయంలో చాలా గందరగోళం నెలకొంది. మొదట పది గంటలకే సీఎంగ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించారు. తర్వాత 1.04 గంటకు మార్చారు. మంత్రుల విషయంలో ఇదే జరుగుతోంది. సీఎంతోపాటు ఐదుగురు ప్రమాణం చేస్తారని తొలుత ప్రచారం నడిచింది. తర్వాత ఆ సంఖ్య ఆరుకు పెరిగింది. అలా పెరుగుతూనే ఉంది. ఎంత మంది చేస్తారనే అధికారిక సమాచారం మాత్రం లేదు.
కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం ఒకటి రెండు ఖాళీలు ఉంచి పూర్తి స్థాయి మంత్రివర్గంతోనే ప్రమాణం చేయించాలని చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై రేవంత్ సమస్యలు వస్తాయని ముందు ఐదారుగురితో ప్రమాణం చేయించి తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకొని విస్తరించుకుంటే బాగుంటుందని చెప్పినట్టు సమాచారం.
ముఖ్యమంత్రి పదవి రేవంత్‌కు కట్టబెట్టినందున కనీసం మంత్రివర్గంలో స్థానమైన దక్కించుకోవాలని సీనియర్ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నందున ఇంకొక వ్యక్తికి మాత్రమే స్థానం కల్పించాలని భావిస్తున్నారు.
ఇలా వివిధ రకాల లెక్కలు, సమాజిక కోణం, ఇతర రాజకీయ ప్రాధాన్యాలను అంచనా వేసుకొని సీనియర్ల జాబితాలో భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పోటీలో ఉంటారని సమాచారం. జూనియర్లో జాబితాలో అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.