Congress Vijayabheri Sabha at Tukkuguda:
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించనున్న సభకు పోలీసుల అనుమతి లభించింది. సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నేతలు రంగారెడ్డి తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ సభకు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరు కానున్నారని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 9 గంటలకు వరకు సభ నిర్వహించుకునేందుకు అనుమతి లభించింది.
కాంగ్రెస్ విజయభేరి సభకు పోలీసులు అనుమతి రాకున్నా పార్టీ శ్రేణులు తుక్కుగూడలో సభ నిర్వహణకు ఏర్పాట్లు కొనసాగించాయి. ఈ క్రమంలో తుక్కుగూడలో సభ నిర్వహణకు రాచకొండ పోలీసులు అనుమతి ఇచ్చారు. మొత్తం 25 కండీషన్లతో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు. మరోవైపు సభకు 10 వేలకు మించి మంది పాల్గొనకూడదని పోలీసులు షరతులు విధించారు. కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం లక్షల్లో నేతలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొనేలా సభకు ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియా గాంధీకి నాలుగున్నర కోట్ల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపేందుకు సభ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సెప్టెంబర్ 17న మహేశ్వరం నియోజకవర్గం, తుక్కుగుడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో “విజయ భేరి” మోగిద్దాం అంటూ పిలుపునిచ్చారు.