Telangana Rains | హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 3.6 కి. మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 24 నుంచి 26 గంటల్లో ఉపరితల ఆవర్తనం పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు నెమ్మదిగా చేరుకోనుంది. నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ద్రోణి ట్రోపో ఆవరణము వరకు విస్తరించి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఆదివారం రాత్రి, లేక సోమవారం అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ఆదివారం రాత్రి, లేక సోమవారం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దాని ప్రభావంతో నవంబర్ 10 నుంచి 12 వరకు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మిగతా చోట్ల తేలికపాటి జల్లులకు అవకాశం ఉంది. ఆదివారం రోజు ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని చెప్పారు. అయితే నవంబర్ 11, 12 తేదీలలో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురవనుందని అంచనా వేశారు. సోమ, మంగళవారాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత సురక్షితం కాదని.. తీరం వెంట గాలుల ప్రభావంపై ఇది ఆధారపడి ఉంటుంది.
Synoptic features of weather inference of Andhra Pradesh dated 09-11-2024 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/yRSWJvzOhu
— MC Amaravati (@AmaravatiMc) November 9, 2024
నవంబర్ 11, 12 తేదీలలో వర్షాలు కురవనున్న జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో పాటు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం కురవనుంది. రాయలసీమ జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, అటు అధికారులను ఇటు ప్రజలను అప్రమత్తం చేశారు.
తెలంగాణలో వాతావరణం..
తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ప్రభావం అంతగా ఉండదు. నవంబర్ 11, 12 తేదీలలో తెలంగాణలో వాతావరణం పొడిగా మారుతుంది. నవంబర్ 13 తేదీన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళ పొగ మంచు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, ఈశాన్య దిశలో గంటలకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల మేర నమోదు అవుతోంది.
Also Read: TG Praja Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! – తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
నిజామాబాద్ జిల్లాలో 35 డిగ్రీలు, ఖమ్మంలో 34, మెదక్ లో 33.2 డిగ్రీలు, హన్మకొండ, భద్రాచలంలో 33 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రివేళ మెదక్, ఆదిలాబాద్ లో చలి చంపేస్తోంది. మెదక్ లో 15.4 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 16.2 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదు కాగా, పటాన్ చెరులో 16.4 డిగ్రీలు ఉండటంతో ఈ ప్రాంతాలలో చలి తీవ్రత అధికంగా ఉంది.
మరిన్ని చూడండి