Rajya Sabha candidate Abhishek Manu Singhvi in Hyderabad | హైదరాబాద్: తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన అభిషేక్ మను సింఘ్వీ హైదరాబాద్ కు విచ్చేశారు. అనంతరం ఆదివారం సాయంత్రం నగరంలోని గచ్చిబౌలిలోని షెర్టాన్ హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని ఆమోదించినందుకు ఏఐసీసీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎల్పీ తీర్మానం చేసింది. అభిషేక్ మను సింఘ్వీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య తదితరులు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. సోమవారం (ఆగస్టు 19న) ఉదయం 11 గంటలకు అభిషేక్ మను సింఘ్వీ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీనియర్ నేత కే కేశరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం తెలిసిందే. కేకే రాజీనామాతో ఓ స్థానం ఖాళీ అయింది.
అంతకుముందు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణకు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆదివారం మధ్యాహ్నం ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా అభిషేక్ సింఘ్వీ మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను కలిసి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని సింఘ్వీ ఆహ్వానించారు.
మరిన్ని చూడండి