Purandeswari Supports Pushpa 2 Actor Allu Arjun | ఒంగోలు: హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటను ప్రేరేపించింది హీరో అల్లు అర్జున్ కాదు అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తన సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో కనుక హీరో అల్లు అర్జున్ థియేటర్‌కు సినిమా చూసేందుకు వెళ్లారు. కానీ ఈ ఘటనకు బాధ్యుడ్ని చేసి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సమంజసం కాదని రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ఇదివరకే అరెస్టైన అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
అల్లు అర్జున్‌కు బీజేపీ నుంచి మద్దతు
ఇదివరకే బీఆర్ఎస్ నేతల నుంచి అల్లు అర్జున్‌కు మద్దతు లభించింది. తన పేరు మరిచిపోయాడన్న కారణంగా అల్లు అర్జున్ ను సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులైన బండి సంజయ్, కిషన్ రెడ్డి సైతం సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతికి అల్లు అర్జున్ ను బాధ్యుడ్ని చేయడం కరెక్ట్ కాదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ప్రజలకు పోలీసులు రక్షణ కల్పించలేకపోయారని వ్యాఖ్యానించారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సమయంలో ఒక హీరోగా అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్లారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా ఉన్నారు. మిగిలిన వారిని కాకుండా అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై చర్చ
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. బయట దారుణం జరిగిందని పోలీసులు వెళ్లి అల్లు అర్జున్ కు చెబితే అప్పుడు కూడా బయటకు వచ్చిన నటుడు వాహనం రూఫ్ టాప్ నుంచి చేతులు ఊపుతూ వెళ్లారు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా.. వీరిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేశాం. నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశాం. తొక్కిసలాట ఘటకు అతడే కారణం. పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నా సంధ్య 70ఎంఎం థియేటర్‌కు ప్రీమియర్ షోకు ఫ్యామిలీతో అల్లు అర్జున్ వచ్చారు. ఆయనను చూసేందుకు, ప్రీమియర్ షో కావడంతో ఒక్కసారి జన సందోహం పోగవ్వడంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ఘటన జరిగిందని ఏసీపీ వచ్చి చెబితే అల్లు అర్జున్ అవేమీ పట్టించుకోకుండా సినిమా చూశారని, ఇక లాభం లేదనుకుని డీసీపీ వచ్చి అరెస్ట్ చేయమంటారా అని గట్టిగా అంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా వెళ్లిపోవాలని చెప్పినా, అన్ని తెలిసీ కూడా అల్లు అర్జున్ వాహనం రూఫ్ టాప్ ఓపెన్ చేసి షో చేస్తూ వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.25 లక్షల చెక్ అందించారు. శ్రీతేజ్ ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని తెలిపారు.
మరిన్ని చూడండి