Homeస్పెషల్ స్టోరీశ్రీవారి భక్తులకు అలర్ట్, తిరుమలకు వెళ్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందులే

శ్రీవారి భక్తులకు అలర్ట్, తిరుమలకు వెళ్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందులే


TTD closed srivari mettu walkway in Tirumala | తిరుమల: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాభావ పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. శ్రీవారి మెట్టు నడకదారి మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. మెట్టు దారితో పాటు తిరుమలలోని పాపవినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు మూసివేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గురువారం సైతం భక్తులకు మార్గంతో పాటు ఇవి అందుబాటులో ఉండవని ఈవో స్పష్టం చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఈవో సూచించారు.

శ్రీవారి నడకమార్గాల్లో ఒకటి క్లోజ్, ఒకటి ఓపెన్

తిరుమలకు నడక మార్గాలు రెండు కాగా, ఒకటి శ్రీవారి మెట్టు నడక మార్గం, మరొకటి అలిపిరి మెట్ల మార్గం. అయితే వర్షాల కారణంగా టీటీడీ అధికారుల శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేశారు. దాంతో తిరుమలకు వెళ్లే భక్తులు అంతా అలిపిరి నుంచి వెళ్లే మెట్ల మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గాన్ని తెరిచే ఉంచుతారు కనుక భక్తులకు ఇబ్బంది ఉండదని టీటీడీ చెబుతోంది. ఒకవేళ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడటం లాంటివి జరిగితే, వెంటనే క్లియర్ చేయడానికి జేసీబీలు ఏర్పాటు చేస్తున్నారు. అందుకు అవసరమైన సిబ్బందిని సైతం టీటీడీ అందుబాటులో ఉంచనుంది. 

2021లోనూ భారీ వర్షాల సమయంలో కొన్ని రోజులపాటు నడకదారి మెట్టు మార్గాన్ని టీటీడీ మూసివేయడం తెలిసిందే. ఆ సమయంలో శ్రీవారి నడకదారి మెట్టు మార్గం బాగా దెబ్బ తినగా, అనంతరం అధికారులు మరమ్మతులు చేశారు. తాజాగా రెండు రోజుల నుంచి తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్

రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో తిరుపతి, కాళహస్తిలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరుతోంది. సత్యవేడు, నగరిలో శివారు ప్రాంతాల వారు వరద నీటితో ఇబ్బంది పడుతున్నారు. స్వర్ణముఖి నది సైతం వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. అమరావతి వాతావరణ కేంద్రంతో పాటు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ గురువారం సైతం తిరుపతి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేశారని తెలిసిందే. ఇటీవల ఖమ్మం, విజయవాడలో ఫ్లాష్ ఫుడ్స్ వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం కళ్లారా చూశాం. తాజాగా మరోసారి ఆకస్మిక వరదలు (Flash Floods) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

భారీ వర్షాలు కురుస్తున్నందున గురువారం సైతం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యా సంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీలు రేపు నిర్వహించకూడదని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల  వారిపై, నదీ పరివాహక ప్రాంతాలపై ఫోకస్ చేయాలని సూచించారు.

Also Read: Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆర్జితసేవా టికెట్ల విడుదలపై ప్రకటన

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments