Maruti Suzuki Achieves Big Milestone: మారుతి సుజుకి భారతదేశంలోనే నంబర్ వన్ కార్ సెల్లింగ్ కంపెనీ. ఇప్పుడు ఎగుమతుల్లో కూడా మంచి రికార్డును సాధించింది. ప్రస్తుతం అనేక దేశాలకు 30 లక్షల కార్లను ఎగుమతి చేయడం ద్వారా మరోసారి పెద్ద మైలురాయిని సాధించింది. ఈ విధంగా మారుతి సుజుకి భారతదేశం నుంచి అత్యధిక కార్లను ఎగుమతి చేస్తున్న కంపెనీగా అవతరించింది. భారతదేశంలో కూడా అత్యధిక కార్లను విక్రయిస్తున్న కంపెనీగా కూడా ఈ కారు నిలిచింది.
30 లక్షల కార్లను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కొత్త మైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి చాలా సంవత్సరాలుగా భారతదేశంలో కార్లను విక్రయిస్తోంది. ఇప్పుడు 30 లక్షల కార్లు ఎగుమతి చేయడం అనేది ఒక పెద్ద విజయం అని చెప్పవచ్చు.
మారుతి సుజుకి ఏ దేశాల్లో కార్లను విక్రయిస్తోంది?
మారుతి సుజుకి ప్రస్తుతం భారతదేశంలో తయారైన కార్లను ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేస్తోంది. సుజుకి అంతర్జాతీయంగా కార్లను విక్రయిస్తుంది. మారుతి సహకారంతో భారతదేశంలో కార్లను తయారు చేయడంతో పాటు విక్రయిస్తుంది. దీంతో పాటు భారతదేశంలో తయారు అవుతున్న మారుతి సుజుకి కార్లు ఇప్పుడు విదేశాలలో కూడా అమ్ముడవుతున్నాయి.
Also Read: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు – భారీగా పెరుగుతున్న డిమాండ్!
మారుతి సుజుకి కార్ల ఎగుమతి గణాంకాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉందని చూపిస్తుంది. ఎగుమతుల్లో ముందున్న లేదా అత్యధిక డిమాండ్ ఉన్న కార్లలో మారుతి సుజుకి సెలెరియో, ఫ్రాంక్స్, సియాజ్, డిజైర్, బలెనో, ఎస్ ప్రెసో వంటి ఫేమస్ కార్లు ఉన్నాయి. గత మూడేళ్లలో కంపెనీ ఎగుమతులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. కంపెనీ కార్లు అంతర్జాతీయ స్థాయిలో చాలా ప్రశంసలు పొందాయి. దాని కారణంగా అమ్మకాలు పెరిగాయి.
ఎగుమతి ఎప్పుడు ప్రారంభమైంది?
మారుతి సుజుకి 1986లో భారతదేశం నుంచి వాహనాలను ఎగుమతి చేయడం ప్రారంభించింది. 500 కార్ల మొదటి పెద్ద షిప్‌మెంట్‌ను 1987 సెప్టెంబర్‌లో హంగేరీకి పంపారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 10 లక్షల వాహనాలను ఎగుమతి చేసి మొదటి మైలురాయిని సాధించింది. దీని తరువాత 2020-21 ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల యూనిట్ల ఎక్స్‌పోర్ట్ మార్కును తాకింది. ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 30 లక్షల యూనిట్ల మార్కును అందుకుంది. మొదటి 10 లక్షల మార్కును అందుకోవడానికి 27 సంవత్సరాలు పట్టగా… 10 నుంచి 20 లక్షలకు చేరడానికి తొమ్మిది సంవత్సరాలే పట్టింది. ఇప్పుడు కేవలం మూడు సంవత్సరాల తొమ్మిది నెలల్లోనే తదుపరి 10 లక్షల యూనిట్లను అంటే 20 లక్షల నుండి 30 లక్షల యూనిట్ల సంఖ్యను కంపెనీ తాకింది.
మారుతి సుజుకి కంపెనీ చాలా తక్కువ ధరలో కార్లను విక్రయిస్తుంది. దేశంలో ఎక్కువ మంది ఈ కంపెనీ కార్లను ప్రిఫర్ చేయడానికి కారణం కూడా అదే అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనదేశంలో అత్యంత చవకైన కారు ఆల్టో. దాన్ని విక్రయిస్తుంది కూడా మారుతి సుజుకినే. ప్రస్తుతం కార్లలో సేఫ్టీ ఫీచర్లపై కూడా మారుతి సుజుకి దృష్టి పెట్టింది.
Also Read: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ – ఎంత తగ్గుతుందో తెలుసా?
మరిన్ని చూడండి