Homeస్పెషల్ స్టోరీమొన్న బీసీ - నేడు మాదిగ సమావేశాలకు మోదీ - తెలంగాణలో సక్సెస్ ఫార్మలా కనిపెట్టారా...

మొన్న బీసీ – నేడు మాదిగ సమావేశాలకు మోదీ – తెలంగాణలో సక్సెస్ ఫార్మలా కనిపెట్టారా ?


Telangana Elections 2023 Combination Of BC And Madiga As A Success Formula : ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ( Narendra Modi ) నాలుగు రోజుల వ్యవధిలో మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు.   తెలంగాణలో ( Telangana ) ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారు. కానీ  ఆ ఎన్నికల ప్రచారం పార్టీ సమావేశాలుగా కాకుండా కాస్త కుల సంఘాల సమావేశాలుగా జరుగుతూండటమే విశేషం.  ఎల్బీ స్టేడియంతో ప్రధాని మోదీ బీసీ  ఆత్మగౌరవ సభ లో పాల్గొన్నారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని నినాదం ఇచ్చారు. 

బీసీ నినాదంతోనే తెలంగాణ రాజకీయం 

తెలంగాణ బీజేపీ చివరి అస్త్రంగా బీసీ నినాదం ఎంచుకుంది. బీసీ  ని సీఎంను చేస్తామని అమిత్  షా ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.  ఓ బీసీ నాయకుడు  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే.. కారణం లేకుండా తొలగించి.. అదీ కూడా పార్టీని తన నాయకత్వ ప్రతిభతో బలపర్చినప్పటికీ తొలగించారని అంటున్నారు.   ఇప్పుడు బీసీ సీఎంను చేస్తామని ప్రకటించి ఆ మైనస్‌ను ప్లస్ చేసుకోవాలనుకుంటున్నారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవలి కాలంలో చాలా చోట్ల స్వయంగా  తాను ఓబీసీనని ప్రచారం చేసుకుంటున్నారు. తాను ఓబీసీని అయినందునే విపక్ష నేతలు తిడుతున్నారని కూడా అన్నారు.  ఆయన మాటలు ప్రధాని స్థాయిలో లేవని విమర్శలు వచ్చినా తగ్గడం లేదు. తెలంగాణలోనూ అదే ఫార్ములా పాటిస్తున్నారు. బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు. 

శనివారం ఎస్సీ వర్గకరణ సభలో పాల్గొంటున్న మోదీ  

ఎంతో కాలంగా వివాదాస్పదంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సభలో పాల్గొంటున్నారు.  ఇది మాల, మాదిగ కులాల మధ్య ఉన్న వివాదం.  ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి.    ఎస్సీలకు మొత్తంగా 15 శాతం రిజర్వేషన్ కోటా ఉంది.మాల, మాదిగ అనే వర్గీకరణ లేకుండా రెండు వర్గాలను దళితులుగా చూస్తున్నారు. మాల, మాదిగ కాకుండా దళిత వర్గాల్లో 57 ఇతర కులాలు కూడా ఉన్నాయి. కానీ వారి జనాభా దళిత వర్గాలల్లో ఇరవై శాతం మాత్రమే ఉంటారు.  అయితే, ఈ కోటాలో మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ నిజానికి 1970 దశకంలోనే మొదలైంది. 1972 నుంచి మొదలై, ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ మాదిగ నేతలు వారిని కలవటం, ఈ అంశాన్ని లేవనెత్తుతూ వారికి విజ్ఞప్తులు అందజేయడం జరుగుతూ వస్తోంది. జనాభాపరంగా మాలలకన్నా మాదిగల సంఖ్య ఎక్కువ అయినప్పటికీ, విద్యా, ఉద్యోగావకాశాల్లో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తేల్చింది.  రాజకీయ రంగంలో కూడా ఈ తేడా స్పష్టంగానే  ఉంది. ఎస్సీ రిజర్వుడు సీట్లలో మాలలు ఎక్కువగా అవకాశాలు పొందుతున్నారు.  దీంతో ఉద్యమం ప్రారంభమైంది.  అయితే వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఉద్యమం ప్రారంభించింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. 

పలు మార్లు రాజకీయం – వర్గీకరణతో ఓట్ల వేట 

2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టం చేసింది. అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కే. ఆర్. నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో ఎస్సీలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరిస్తూ, వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించారు. 2004 నవంబర్‌లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చుక్కెదురైంది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్ వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని ప్రకటించింది సుప్రీంకోర్టు.   మందకృష్ణ ఇప్పటికీ తన పోరాటం చేస్తూనే ఉన్నారు.  2014లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ తనకు తాను ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడారని, తమను కలిసి ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధం చేస్తామని హామీ ఇచ్చారని ఇటీవలే మందకృష్ణ మాదిగ అన్నారు.   కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికైనా వర్గీకరణ అంశంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన ఇటీవల ప్రధానిని కోరారు. ఆయనకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం ఆప్యాయంగా పలకరించడంతో  ఏదో ఉందని అనుకున్నారు. ఇప్పుడు అది నిజం అవుతోంది. ఎస్సీ వర్గీకరణ ప్రకటిస్తే  మాదిగలంతా మద్దతు పలుకుతారని మోదీ నమ్ముతున్నారు. తానీ మాలలకు అన్యాయం చేసినట్లు కాదా అన్న ప్రశ్న వచ్చినా అలా ఆలోచించడం ఇప్పుడు రాజకీయం కాదు. 

బీసీ – మాదిగ సమీకరణాలతో బీజేపీ విజయవంతం అవుతుందా ?  

తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బీసీ, మాదిగ సమీకరణాలతో  విజయం అందుకోవాలన్న ఆలోచనలో ఉందని ప్రధాని పర్యటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలా చేయడం ఎంత వరకూ సమర్థనీయం అనే ప్రశ్న రావొచ్చు. కానీ రాజకీయం అంటే.. అంతే మరి అని సర్దిచెప్పుకోవాల్సిందే. అంతిమంగా వ్రతం చెడినా బీజేపీకి ఫలితం దక్కుతుందా లేదా అన్నది ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. 



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments