Hyderabad News Today: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్ మీర్‌పేట హత్య కేసు మరో మలుపు తిరిగింది. భార్యను హత్య చేసి డెడ్‌బాడీ అనవాళ్లు కూడా లేకుండా చేసిన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని మాట వినిపిస్తోంది. అందుకే ఇల్లాలను చంపేసి ఉంటాడని అంటున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది.
మీర్‌పేట హత్య కేసులో ఎలా దర్యాప్తు చేయాలో పోలీసులకు అంతపట్టడం లేదు. భార్యను హత్య చేసినట్టు భర్త ఒప్పుకుంటున్నాడు. కానీ హత్యకు సంబంధించిన అనవాళ్లు కనిపించడం లేదు. దీంతో పోలీసులకు ముందుకు కదల్లేకపోతున్నారు. అయితే నిందితుడిగా అనుమానిస్తున్న భర్త ఫోన్ చూస్తే పోలీసులకు ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.
భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి ఉడికించి ఎముకలను రోట్లో వేసి దంచి పొడిగా చేసిన గురుమూర్తికి మరో మహిళతో సంబంధం ఉన్నట్టు చెబుతున్నారు. కేసు విచారణలో భాగంగా సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులకు కొన్ని ఫొటోలు లభించినట్టు చెబుతున్నారు. దీంతో భార్యను వదిలించుకునేందుకు ప్లాన్ చేసే ఈ హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో మాజీ సైనికుడు చేసిన హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాను హత్య చేసినట్టు ఒప్పుకుంటున్న పోలీసులను గురుమూర్తి తిరిగి ప్రశ్నించాడని తెలుస్తోంది. తానే హత్య చేసినట్టు ఆధారాలు ఏం ఉన్నాయని ఎలా ప్రూవ్ చేస్తారని వారిని అడుగుతున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు రెండురోజుల నుంచి ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నా ఒక్క ఆధారం కూడా సేకరించలేకపోయారు.
Also Read: దొంగల్లో దరిద్రులంటే వీళ్లే – రోడ్డు రోలర్ కొట్టేయడం ఏందిరా అయ్యా !
చంపేసి కుక్కర్‌లో ఉడికించి…
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి ఈ నెల 15న భార్య వెంకటమాధవిని హత్య చేశాడు. అంతకంటే ముందే పిల్లలను పండగ సెలవులకు హైదరాబాద్‌లోనే ఉంటున్న తాతగారి ఇంటికి పంపేశాడు. సంక్రాంతి రోజున భార్యను హత్య చేసిన గురుమూర్తి మటన్ నరికే కత్తితో ముక్కలుగా కత్తిరించాడు. తర్వాత కుక్కర్‌లో ఆ ముక్కలను వేసి ఉడికించాడు. అనంతరం వాటిని రోకలితో దంచి పొడి చేశాడు. ఆ పొడిని జిల్లెలగూడ చెరువులో పడేశాడు.
17న అత్తగారికి ఫోన్ చేసి భార్య కనిపించడం లేదని చెప్పారు. పోలీసులకు 18న ఫిర్యాదు చేశారు. సీసీటీవి ఫుటేజ్ చూసిన పోలీసులు ఆమె బయటకు వెళ్లలేదని తేల్చారు. గురుమూర్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే తానే హత్య చేసినట్టు స్పష్టం చేశాడు. హత్య చేసిన తర్వాత రెండు రోజులు కూడా ఇంట్లోనే ఉన్నాడు. చుట్టుపక్కల వారు చెడు వాసన వస్తుందని అనడంతో దగ్గర్లో చనిపోయిన కుక్కను చూపించాడు. వారి దృష్టిని మరల్చాడు.
మాధవిని హత్య చేసింది తానే అని గురుమూర్తి అంగీకరించినప్పటికీ ఆధారాలు మాత్రం ఇంత వరకు లభించలేదు. దీని కోసం పోలీసులు శ్రమిస్తున్నారు. శరీర భాగాలు లభిస్తే పిల్లల డీఎన్‌ఏతో సరిపోల్చి దర్యాప్తు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 13 ఏళ్ల కిందట వివాహమైన గురుమూర్తి మాధవి దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఆధారాలు కోసం వెతుకుతున్న పోలీసులకు వేరే వ్యక్తితో గురుమూర్తికి సంబంధాలు ఉన్నట్టు గుర్తించారని తెలుస్తోంది. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏమైనా సరే సాంకేతిక ఆధారాలు లేకుండా కేసులు ముందుకెళ్లడం అనుమానంగానే ఉంది.
మరిన్ని చూడండి