Telangana Cabinet Key Decisions: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. భూమి లేని పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుమారు 5 గంటలకు పైగా కేబినెట్ భేటీ జరిగింది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28న ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఏడాదిలో 2 విడతలుగా అందించే ఈ డబ్బులో తొలి విడతగా రూ.6 వేల మొత్తాన్ని ఆ రోజున లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రకటించారు. తెలంగాణలో దాదాపు 50 లక్షలకు పైగా భూమి లేని కుటుంబాలు ఉండగా వారికి సంవత్సరానికి రూ.12,000 వేలు చొప్పున రెండు విడతల్లో ఇవ్వనున్నారు. అలాగే, వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రైతులకు, వ్యవసాయం కోసం నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు
సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. కొత్తగా 36 లక్షల మందికి ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. అర్హులకు ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్న బియ్యం అందజేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్‌లు ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్లు చెప్పారు.
ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణ
ఈ – ఫార్ములా రేస్ నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారని ప్రభుత్వం వెల్లడించింది. న్యాయ నిపుణుల సలహా మేరకు గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని సర్కారు పేర్కొంది. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ – కార్ రేస్ వ్యవహారంలో చట్టప్రకారమే దర్యాప్తు కొనసాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతి ఇప్పటికే లభించిందని, గవర్నర్ అనుమతి ఇస్తూ జారీ చేసిన దస్త్రాన్ని సోమవారం రాత్రి, లేదా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి పంపిస్తారని అన్నారు. చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
‘గవర్నర్ అనుమతిపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఈ వ్యవహారంలో జరిగిన దోపిడీపై కేబినెట్‌లో చర్చించాం. కేటీఆర్ అరెస్టుపై నేనేమీ చెప్పలేను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇటీవల బీఆర్ఎస్ నేతలు బాంబు తుస్సుమందని వ్యాఖ్యానించారు. అది తుస్సుమనేదైతే.. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేశారు.?. అసెంబ్లీలో ఎమ్మెల్యేల్లా కాకుండా గూండాల్లా ప్రవర్తించారు. మాట్లాడడానికి అంశం లేనందుకే ప్లకార్డులు, నినాదాలతో సభకు ఆటంకం కలిగించారు. ఈ సమావేశాల్లో ఆర్వోఆర్ బిల్లు ప్రవేశపెడతాం. ఇందిరమ్మ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదు. ప్రధానమైన అవినీతిని ప్రజల ముందు ఉంచుతున్నాం.’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా, 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహణకు సంబంధించి రూ.55 కోట్ల చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
మరిన్ని చూడండి