Chandrababu Class To MLAs: ఎట్టి పరిస్థితుల్లోనూ బూతులు మాట్లాడొద్దంటూ ఎమ్మెల్యేలను ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ (AP Assembly Speaker) అయ్యన్నపాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అవగాహన సదస్సును నిర్వహించారు. ఎలా మాట్లాడాలి, ఏయే అంశాలపై ఎలా చర్చను కొనసాగించాలి , ప్రశ్నోత్తరాల సమయంలో సమయంలో వివిధ శాఖలకు సంబంధించిన ప్రశ్నలను ఎలా అడగాలి అనే అంశాలపై ఎమ్మెల్యే లకు దిశా నిర్దేశం చేసేందుకు చంద్రబాబు ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రసంగాల్లో బూతులు మాట్లాడొద్దు అంటూ హెచ్చరించారు. శాసనసభలోనే కాదు ప్రజల్లో మాట్లాడే సందర్భాల్లోనూ , మీడియాతో సంభాషించేటప్పుడు గానీ బూతు అనే మాట దొరలనివ్వొద్దని చాలా గట్టిగా చెప్పారు. తమను ప్రజలు అనుక్షణం గమనిస్తున్నారనే సంగతి ప్రజా ప్రతినిధులు గుర్తు పెట్టుకోవాలని చిన్న తప్పుడు మాటను కూడా ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారని ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలకు తెలిపారు. ప్రజా ప్రతినిధులు హుందాగా ఉండడం అలవాటు చేసుకోవాలని వారు ఎమ్మెల్యేలకు సూచించారు.
బూతులు మాట్లాడే గత ప్రభుత్వం ఓడిపోయింది
గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బ తినడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన బూతులు ప్రధాన కారణమని చంద్రబాబు అన్నారు. చట్టసభల్లో సైతం వారు యథేచ్చగా బూతులు మాట్లాడే వారనీ.. అలాంటి ప్రవర్తన తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యే లు వాడిన ప్రతి బూతు, తిట్టు ఆ పార్టీకే శాపంలా తయారయ్యాయని, ప్రజలు ఆ ప్రవర్తనను అసహ్యించుకున్నారని అందుకే ఎన్నికల్లో ఆ పార్టీ అంతలా ఓడిపోయిందని చంద్రబాబు ఎమ్మెల్యే లకు తెలిపారు. అందుకే కూటమి ఎమ్మెల్యేలు తమ భాష, ప్రవర్తన హుందాగా ఉండేలా చూసుకోవాలని అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యేలకు స్పీకర్ తో కలిపి ముఖ్యమంత్రి హెచ్చరించారు.
Also Read: తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ – సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?
రేపటి నుండి పునః ప్రారంభం కానున్న అసెంబ్లీ
ఏపీ అసెంబ్లీ రేపటి నుండి మళ్ళీ ప్రారంభం కానుంది. సోమవారం నాడు మొదలైన అసెంబ్లీ సమావేశాలకు అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టాక మంగళవారం బ్రేక్ ఇచ్చారు. ఎమ్మెల్యేల అవగాహన సదస్సు కోసం ఒక్కరోజు హాలిడే ఇచ్చి రేపటినుండి మళ్లీ సమావేశాలు ప్రారంభించనున్నారు. ఈ సమావేశాలకు వైసిపి పార్టీ దూరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ అనడం నిబంధనల దృష్ట్యా అది సాధ్యం కాదని స్పీకర్ కార్యాలయం తన నిర్ణయం తెలపడంతో ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో సహా అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించారు.
మరిన్ని చూడండి