గడిచిన నెలరోజులుగా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం చేయాలని పోరాటం చేసిన మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య చివరకు ఆయనే పార్టీ వీడిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పై ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొన్నాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొన్నాలను బీఆర్ఎస్ లోకి తానే ఆహ్వానిస్తానని మీడియాతో జరిగిన చిట్ చాట్ లో కేటీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… పొన్నాల మా పార్టీలోకి వస్తారంటే సంతోషిస్తామని చెప్పారు. రేపే ఆయన ఇంటికి వెళ్లి ఆయనను దగ్గరుండి పార్టీలోకి ఆహ్వానిస్తానని చెప్పారు. కానీ అంతకుముందు ఈ విషయంపై మీడియా పొన్నాలను ఆరా తీసింది. ఈనెల 16వ తేదీన ఆయన కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని జనగామ టికెట్ ఆయనకు బీఆర్ఎస్ ఆఫర్ చేసిందని ప్రచారం జోరుగా నడిచింది. అయితే బీఆర్ఎస్ లోకి గాని, మరి ఇతర పార్టీలో గాని చేరబోతున్నారా? అనే మీడియా ప్రశ్నకు పొన్నాల దాటవేశారు. పదవుల కోసం తాను రాజీనామా చేయలేదని తన భవిష్యత్ పై ఎవరెవరో ఏదేదో ఊహిస్తే తానేమి సమాధానం చెప్పనని వెల్లడించారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ గూటికి పొన్నాల లక్ష్మయ్య చేరుతారా అనే ప్రచారం జోరుగా సాగుతుంది. రాజీనామా తర్వాత కూడా పొన్నాలను కాంగ్రెస్ నేతలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఆయన రాజీనామా పై కాంగ్రెస్ నేతలేవరూ ఇంకా స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీలో జనగామ టికెట్ దక్కదనే కారణంతో పొన్నాల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జనగామ టికెట్ ను ఇప్పటికే పల్ల రాజేశ్వర్ రెడ్డి కి బీఆర్ఎస్ పార్టీ ఫిక్స్ చేసింది. దీంతో నియోజకవర్గంలో పల్లా పర్యటిస్తూ కార్యకర్తలు, ప్రజలతో మమేకం అవుతున్నారు.
నియోజకవర్గంలో కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఇప్పటికే మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో పొన్నాల టిఆర్ఎస్ పార్టీలో చేరినా జనగామ టికెట్ ఇచ్చే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఈనెల 16వ తేదీన జనగామలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఆరోజు పొన్నాల టిఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జనగామలో జోరుగా వినిపిస్తోంది.
రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు టికెట్లలో ప్రాధాన్యత ఇవ్వాలంటూ పొన్నాల ఫస్ట్ నుంచి గట్టిగా ఫైట్ చేస్తున్నారు. బీసీలకు టికెట్లు ఇస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందని పొన్నాల కాలుకు బలపం కట్టుకుని మరీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా నేతలను కలిశారు. గడిచిన రెండు వారాలుగా కీలక బీసీ నేతలంతా హస్తినలోనే ఉన్నారు. పెద్దలను కలిసి కనీసం 34 సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేయాలనుకున్నారు.
కానీ అక్కడా పెద్దగా స్పందన కనిపించలేదు. చివరకు గతంలో ప్రాతినిధ్యం వహించిన జనగాం టికెట్ విషయంలోనూ, 12 ఏళ్లు మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తనను పరిగణలోకి తీసుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు పొన్నాల. ముందు నుంచి పొన్నాల లక్ష్మయ్య బీసీ కార్డు అందుకున్నారు. పార్టీలోని బీసీ నేతలను కలుపుకుని ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. తమ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేలా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండాపోయింది.
పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు పొన్నాల. ఇక్కడ బీసీలు, సీనియార్టీ కంటే కూడా విల్లాలు, డబ్బు ఇచ్చే వారికే అవకాశాలు దక్కుతున్నాయంటూ రేవంత్‌రెడ్డి కనుగోలను టార్గెట్ చేయడం పార్టీ వర్గాల్లో పెనుదుమారం రేపింది. దీంతో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కి దూరంగా ఉంటూ వచ్చారు.