Indiramma committees for housing scheme in Telangana | హైదరాబాద్: పేద ప్రజలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో ముందడుగు పడింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శనివారంలోగా వరకు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆ ఉత్తర్వులలో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఇదివరకే ప్రకటించింది.
ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం
అర్హులైన పేదల ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించనుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మొదటి దశలో రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో ఏర్పాటు కానున్న ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పిస్తాయి. సోషల్ ఆడిట్, అధికారులతో సంప్రదింపులు లాంటి కార్యక్రమాలలో కమిటీలు భాగస్వాములు కానున్నాయి.
గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు
గ్రామాల్లో సర్పంచ్ లేక స్పెషల్ ఆఫీసర్ కమిటీ చైర్మన్ గా మహిళా సంఘాల నుంచి ఇద్దరు మహిళా సభ్యులు గ్రామంలోని ముగ్గురు సభ్యులు (బీసీ, ఎస్సి, ఎస్టీ) ఉండాలి. పంచాయతీ సెక్రటరీ కమిటీ కన్వీనర్ గా వ్యవహరించనున్నారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
పట్టణాల్లో ఇందిరమ్మ కమిటీలు
పట్టణాల్లో మున్సిపల్ వార్డు స్థాయి కమిటీలో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ ఛైర్మన్‌గా ఉంటారు. మహిళా స్వయం సహాయక గ్రూప్ నుంచి ఇద్దరు సభ్యులు, ముగ్గురు స్థానికులు ఇందిరమ్మ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. స్థానిక సభ్యులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఒక్కొక్కరు చొప్పున ఉండాలి. వార్డు అధికారి ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉంటారు. ఈ ఇందిరమ్మ కమిటీలకు పేర్లు పంపించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. వీరు జిల్లా కలెక్టర్లకు పేర్లను సిఫార్స్ చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుల గణన
సమగ్ర కులగణనపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయాలని జీవోలో పేర్కొంది. సామాజిక, విద్య, ఉద్యోగ ఆర్థిక, రాజకీయ, కుల అంశాలపై సర్వే చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ప్రణాళిక శాఖ 60 ఏరోజుల్లో సర్వే పూర్తి చేయాలని జీవోలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపైనా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్‌కు సర్కార్ సూచించింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాతే కొత్త జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.
మరిన్ని చూడండి