Harish Rao Dasara celebrations at Siddipet :
సిద్దిపేట: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర పండుగ దసరా (విజయదశమి)ని ఘనంగా నిర్వహించుకున్నారు. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణకు పాలపిట్ట అన్నారు. దసరా పర్వదినాన పవిత్రమైన పాలపిట్ట సాక్షిగా ప్రమాణం చేసి రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని చూస్తారు. అదే విధంగా రావణ దహన కార్యక్రమాలు సైతం పలు చోట్ల నిర్వహించి సెలబ్రేట్ చేసుకున్నారు.
అనంతరం మంత్రి హరీష్ రావు రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలోనే సిద్దిపేట వాసుల కల నెరవేరుతుందన్నారు. సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరులకు రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దసరా నాటికి సిద్దిపేటకు రైలు తెస్తానని గత దసరా రోజు చెప్పా.. ఈ విజయదశమి లోపు సిద్దిపేటకు రైలు తెచ్చి దశాబ్దాల కల సాకారం చేసుకున్నాం అన్నారు. మనం సిద్దిపేటను జిల్లా చేసుకున్నాం, గోదావరి నీళ్లు కూడా తెచ్చుకున్నాం.. త్వరలోనే మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. స్థానిక ప్రజల దీవెన, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేట రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
శమీ శమయతే పాపం, శమీశతృ వినాశనీ |
అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ ||
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ నేటి ఉదయం విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీష్ రావు.