Telangana Assembly Session Started: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 5 బిల్లులు, 2 నివేదికలను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సభలో ప్రసంగించారు. 60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించి, 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, మన దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియాగాంధీ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల తరఫున ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంతో, ఇక్కడ ప్రజలతో సోనియాగాంధీది విడదీయలేని అనుబంధం అని పేర్కొన్నారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ అవతరణ దినోత్సవంగా నిర్వహించాలని ప్రకటించారు. తొలిరోజు 5 బిల్లులు, 2 నివేదికలను సభలో ప్రవేశపెట్టనున్నారు.
‘4 కోట్ల బిడ్డల భావోద్వేగం’
2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని.. ఆ రోజు తెలంగాణ పర్వదినం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. నా తెలంగాణ.. కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు నిత్యసత్యం. భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు.. ఆ జాతీ అస్తిత్వమే. అస్తిత్వానికి మూలమైన సంస్కృతికి ప్రతిరూపమే తల్లి. స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి. తెలంగాణ జాతి భావనకు జీవం పోసింది. తెలంగాణ తల్లి స్వరూపానికి అధికారిక గుర్తింపు లేదు. ప్రజా పోరాటాలకు ఊపిరి పోసుకున్న మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయించాం. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి అంటే 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ప్రజల మనోఫలకాల్లో నిలిచిన రూపాన్ని సచివాలయ ప్రాంగంణంలో ఆవిష్కరించుకుంటున్నాం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని విగ్రహాన్ని రూపకల్పన చేశాం.’ అని తెలిపారు.
ప్రతిపక్షాలకు విజ్ఞప్తి..
ఆరు దశాబ్దాలుగా రకరకాల రూపాల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజలు తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆనాడు సోనియాగాంధీ.. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ 9న ప్రకటించారు. అధికారికంగా ఇప్పటివరకు తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ప్రకటించలేదు. ప్రజల ఆకాంక్షలు గౌరవించలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యమ సందర్భంలో యువత గుండెలపై రాసుకున్న టీజీ అక్షరాలను వాహనాలకు పెట్టుకున్నాం. ఉద్యమ కాలంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని మన రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం. తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసిన స్ఫురణ కలిగేలా బహుజనుల తెలంగాణ తల్లిని ఇవాళ ప్రతిష్ఠించుకోబోతున్నాం. 4 కోట్ల తెలంగాణ సమాజమంతా ఏకమై ఇవాళ పండగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోబోతున్నాం. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు. ఈ ఒక్కరోజు తెలంగాణ సమాజం కోసం సమయం ఇద్దాం. ఇవాళ వివాదాలకు తావు ఇవ్వొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా.’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
Also Read: Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
మరిన్ని చూడండి