Telangana News: తెలంగాణలో ఆర్‌వోఆర్ చట్టం-2020ను పూర్తిగా ప్రక్షాళన చేసిన ప్రభుతవం కొత్తగా భూభారతి బిల్లును తీసుకొచ్చింది. అనేక రోజులు పరిశోధనల తర్వాత దీన్ని రూపొందించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రకటించారు. ఈ బిల్లు ఏర్పాటుకు ప్రతిపక్షాలు కూడా సలహాలు సూచలు చేశాయని గుర్తు చేశారు. ఈ బిల్లుతో తెలంగాణలోని ప్రతి ఇంచు భూమికి రక్షణ దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రజల భూముల రక్షణతోపాటు కబ్జాదారుల భరతం పట్టేందుకు ఈ బిల్లు సహకరిస్తుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. పదేళ్లు భూములను కబ్జాలు చేసిన వారి పని పడతామని సభా వేదికగా హెచ్చరించారు. ప్రజల భూములను కంటికి రెప్పలాకాపాడుకుంటామన్నారు. అనాలోచితంగా తీసుకొచ్చిన ధరని పోర్టల్ వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. ఇందులో ఉన్న ఇబ్బందులు బీఆర్‌ఎస్ నేతలకి కూడా తెలుసన్న మంత్రి… ఇబ్బందులు వస్తాయని వారు నోరు విప్పడం లేదన్నారు.
ధరణితో కొందరికే మేలు జరిగిందన్న మంత్రి పొంగులేటి… లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కాకపోవడంతో అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. భూ యజమానులకు తెలియకుండానే రికార్డులు తారుమారు అయ్యేవని అందుకే దీన్ని పూర్తిగా బంగాళాఖాతంలో కలిపేసి ప్రజాభిష్ఠం మేరకు కొత్త చట్టం తెచ్చామని పేర్కొన్నారు.
ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం రూపొందించడానికి లక్షల మంది ప్రజల అభిప్రాయాలు, రిటైర్డ్ ఉద్యోగుల ఆలోచనలు, ప్రతిపక్షాల మాటలను కూడా పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు మంత్రి. హరీష్‌రావు, వినోద్ కుమార్ లాంటి వాళ్లు కూడా సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు.
మరిన్ని చూడండి