Kalvakuntla Kavitha is doing politics as a Jagruti leader instead of a BRS leader: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ బీసీ కమిషన్ ను కలిశారు. ఆమె పర్యటనలో ఎక్కడా బీఆర్ఎస్ నేతలు కనిపించలేదు. అలాగే బీఆర్ఎస్ కండువాలు కూడా. తెలంగాణ జాగృతి పేరుతో ఆమె రాజకీయాలు చేస్తున్నారు. జాగృతిలో ఉన్న నేతలే ఆమె వెంట ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆమె చేస్తున్న పోరాటంపై బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంది. ఇదొక్కటే కాదు.. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని కూడా బీఆర్ఎస్ నేతలు లేకుండానే వెళ్లి పరామర్శించి వచ్చారు.
బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా రాజకీయ కార్యక్రమాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అయిన తర్వాత దాదాపుగా ఐదు నెలలకుపైగా జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అనారోగ్యం కారణంగా వైద్యం చేయించుకున్నారు. అయితే హఠాత్తుగా అదానీ ఇష్చూ బయటకు వచ్చిన వెంటనే స్పందించారు. అదానీతో పూర్తిగా కాంగ్రెస్ కు లింక్ పెట్టి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీని మోదీని విమర్శించడం లేదు. కానీ కవిత మాత్రం తన సైలెన్స్ ను బ్రేక్ చేసి మొదటి ట్వీట్ మోదీనే నిలదీశారు. అదానీపై ఆధారాలున్నా పట్టించుకోవడం లేదని తన లాంటి వారిని జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ సంచలనం అయింది.
Also Read: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
జాగృతి లీడర్లతో సమావేశాలు -యాక్టివ్ అవుతున్నానని సంకేతాలు
మరో వైపు ఒకప్పుడు తెలంగాణ జాగృతిగా విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ తర్వాత భారత జాగృతిగా మారింది. ఎన్నికల్లో ఘోరపరాజయం ఎదురు కావడంతో జాగృతి కార్యకలాపాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు తెలంగాణ జాగృతిగానే తన సంస్థను తెరపైకి తెచ్చి పాత నేతలందర్నీ పిలిచి మళ్లీ సమావేశం నిర్వహించారు. ఇక వరుసగా రాజకీయ పోరాటాలు చేయనున్నారు. అయితే అవి రాజకీయం అనే భావన రాకుండా వివిధ వర్గాల కోసం అన్నట్లుగా రాజకీయాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎక్కడా బీఆర్ఎస్ పాత్ర ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కవిత ఇలా సొంతంగా జాగృతి పేరుతో రాజకీయాలు చేయడంపై తెలంగాణ రాజకీయాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇదంతా వ్యూహాత్మకమేనని కొొన్ని వర్గాలు బావిస్తున్నాయి. ప్రస్తుతం కేటీఆర్ పార్టీని నడిపిస్తున్నారు. కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్‌కు పరిమితయమ్యారు. ఆయన వచ్చే ఏడాది మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అప్పటికి మళ్లీ కవిత బీఆర్ఎస్ నేతగా రాజకీయాలు చేస్తారని అంటున్నారు. అయితే కేటీఆర్ తో కవితకు విబేధాలు ఉన్నాయని.. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరాటం కారణంగానే కవిత తన సొంత రాజకీయాలు చేసుకుంటున్నారని అంటున్నారు. ఏది నిజమో భవిష్యత్ రాజకీయ పరిణామాలే స్పష్టం చేసే అవకాశం ఉంది.
మరిన్ని చూడండి