India in T20 World Cup semifinals: భారత్-ఇంగ్లాండ్( IND vs ENG) మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరమే. ఎవరు మర్చిపోగలరు, 2007లో డర్బన్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్(Yuvaraj sing) కొట్టిన ఆరు సిక్సర్లు. ఫ్లింటాఫ్ కవ్వింపులతో చెలరేగిపోయిన యువీ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాది ఇంగ్లాండ్(Eng)ను ఏడిపించేశాడు. ఇలాంటి పోరాటాలు ఎన్నో ఉన్నాయి. 1975లో లార్డ్స్‌లో జరిగిన తొలి ప్రపంచకప్‌లో సునీల్ గవాస్కర్ స్లో బ్యాటింగ్ నుంచి 2007లో యువరాజ్ సృష్టించిన విధ్వంసం వరకూ ఇరు జట్లు మైదానంలో హోరాహోరీగా తలపడ్డాయి. ఇరు జట్లూ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించాయి. 1983లో ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన కపిల్ దేవ్ సేన.. ఆ ఏడాది వరల్డ్‌కప్‌ను స్వదేశానికి తెచ్చి భారత్‌లో క్రికెట్ గతినే మార్చేసింది. పదండి క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసిన ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం….
1983 ప్రపంచకప్ సెమీస్
1983 ప్రపంచకప్‌లో కపిల్ దేవ్ సంచలన సృష్టిస్తూ సెమీస్ చేరింది. సెమీస్‌లో ప్రత్యర్థి ఇంగ్లాండ్. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన ఆ సెమీస్‌లో భారత్ సేన ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 60 ఓవర్లలో కేవలం 213 పరుగులకే పరిమితమైంది. కపిల్‌దేవ్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా…మొహిందర్ అమర్‌నాథ్- యశ్‌పాల్ శర్మ భాగస్వామ్యంతో 54.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్లో అడుగుపెట్టింది. మొహిందర్ అమర్‌నాథ్ 46, యశ్‌పాల్ శర్మ 61, సందీప్ పాటిల్ 51 పరుగులు చేసి భారత్‌ను గెలిపించారు. భారత క్రికెట్ చరిత్రలో ఇది ఓ గొప్ప విజయంగా నిలిచింది.
1987 వరల్డ్‌కప్ సెమీస్
1987లో మరోసారి ఇంగ్లాండ్-టీమిండియా సెమీఫైనల్స్‌లో తలపడ్డాయి. ముంబైలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిటీష్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. గ్రహం గూచ్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా 219 పరుగులకే పరిమితమైంది. మహ్మద్ అజారుద్దీన్ 64 పరుగులు.. కపిల్ దేవ్ 30 పరుగులతో పోరాడినా అది సరిపోలేదు. దీంతో వరుసగా రెండో సెమీస్‌లో ఇరు జట్లు తలపడగా…ఈసారి మాత్రం ఇంగ్లాండ్ గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.
2022 టీ20 ప్రపంచకప్ సెమీస్
రెండేళ్ల క్రితం జరిగిన టీ 20 వరల్డ్ కప్ సెమీస్‌లోనూ ఇంగ్లాండ్‌దే పైచేయి అయింది. పది వికెట్ల తేడాతో బ్రిటీష్ జట్టు గెలిచింది. వన్డే, టీ 20 ప్రపంచకప్‌లను ఒకేసారి గెలిచి చరిత్ర సృష్టించింది. ఆడిలైడ్‌లో జరిగిన ఆ సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20ఓవర్లలో 168 పరుగులు చేసింది. కోహ్లీ 50, హార్దిక్ పాండ్యా 63 పరుగులతో రాణించారు. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిటీష్ జట్టు బట్లర్-హేల్స్ దూకుడుతో ఘన విజయం సాధించింది. బట్లర్ 80, హేల్స్ 86 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. దీంతో 24 బంతులు మిగిలి ఉండగానే మరో వికెట్ పడకుండా గెలిచేసి ఫైనల్లో అడుగుపెట్టింది.
మరిన్ని చూడండి