AP Government Pension Hike to 3 Thousand Rupees: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఏడాది తొలిరోజు నుంచే ఏపీలో పెంచిన పెన్షన్ ను అందించనున్నారు. జనవరి 1 నుంచి పెరిగిన పెన్షన్.. రూ.3 వేలు అందజేయనున్నారు. ఇప్పటివరకూ రూ.2,750 అందిస్తుండగా, కొత్త ఏడాది నుంచి పింఛన్ మొత్తం రూ.3 వేలు చేసింది ఏపీ ప్రభుత్వం. వైఎస్సార్ పెన్షన్ కానుక పేరిట ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు, వితంతువులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పింఛన్ అందిస్తోంది.
2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.1000గా ఉన్న పింఛన్ మొత్తాన్ని సీఎం జగన్ మొదట రూ.2,250కు పెంచారు. ఆపై దశలవారీగా పెంచుతామని హామీ ఇచ్చినట్లుగానే.. 2022లో రూ.2,500 చేశారు. 2023 జనవరి 1 నుంచి పింఛన్ మొత్తాన్ని రూ.2,750కు పెంచారు. 1 జనవరి 2024 నుంచి పెంచిన పింఛన్ రూ.3 వేలలు వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు అందించనున్నారు.
ఇకపై ప్రతినెలా రూ.3,000 పెన్షన్..
ఏపీలో 1 జనవరి, 2024 నుంచి 8 రోజులపాటు పెన్షన్ల పెంపు ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా ప్రతినిధులు, శాసన సభ్యులు జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకు ఈ ఉత్సవాల్లో పాల్గోనున్నారు. జనవరి 3న కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజి గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్.. పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. దాంతోపాటు కొత్తగా అర్హులైన 1,17,161 మందికి పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది ఏపీ సర్కార్.
దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అని అధికారులు చెబుతున్నారు. గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి నెలా 1వ తేదీ ప్రొద్దున్నే లబ్దిదారుల గడప వద్దనే పెన్షన్లు అందజేస్తున్నారు. తాజా పెన్షన్ పెంపుతో ఏటా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.23,556 కోట్ల భారం పడనుంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ పెన్షన్ రూపంలో రూ.83,526 కోట్లను లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది.
ఎవరికైనా పెన్షన్ అందకపోతే జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. టీడీపీ హయాంలో 39 లక్షల మందికి పెన్షన్ ప్రయోజనం చేకూరగా, గత అయిదేళ్లలో పెరిగిన కొత్త వారితో కలిపితే పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 66.34 లక్షలకు చేరింది. గడిచిన 55 నెలల్లో వైసీపీ ప్రభుత్వం కొత్తగా 29,51,760 (29 లక్షల 51 వేల 7 వందల అరవై) పెన్షన్లు మంజూరు చేసింది.
ఏపీలో పింఛన్ పొందేందుకు వీరే అర్హులు
- రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ పొందవచ్చు
- 50 ఏళ్లు పైబడి, కల్లు గీత సంఘాల్లో సభ్యుడిగా లేదా టీపీటీ స్కీమ్ కింద కల్లుగీత కార్మికుడై ఉన్న వారు పెన్షన్ కు అర్హులు.
- 18 ఏళ్లు పైబడి భర్త మరణించిన స్త్రీలు వితంత పెన్షన్ కు అర్హులు, అలాగే 40 శాతం వైకల్యం కలిగి ఉన్న వారు వికలాంగ పెన్షన్ కు అర్హులు.
- 50 ఏళ్ల వయస్సు ఉన్న మత్స్యకారులు పెన్షన్ కు అర్హులు, అలాగే సాంప్రదాయంగా చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న వారికి 40 ఏళ్లు నిండితే పెన్షన్ పొందేందుకు అర్హులు.
- భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళలు ఏడాది తర్వాత పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు. అలాగే, అవివాహితులుగా ఉండి 30 ఏళ్లు నిండిన గ్రామీణ మహిళలు, 35 ఏళ్లు నిండిన పట్టణ మహిళలు పెన్షన్ కు అర్హులు.
- ట్రాన్స్ జెండర్లకు 18 ఏళ్ల వయస్సు ఉంటే వారు పెన్షన్ కు అర్హులు
- కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు సైతం పెన్షన్ కు అర్హులు. వీరికి వయో పరిమితి లేదు. పెన్షన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించి అప్లై చేసుకోవాలి.