Hyderabad Cp Srinivas Reddy: కీలక కేసులో నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ఏడు బృందాలతో కూడిన పోలీసులు గుజరాత్ లో విస్తృతంగా తనిఖీలను నిర్వహించారు. ట్రేడింగ్ వ్యవహారంలో వందలాది మందిని మోసం చేసిన నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసిన పోలీసులు ట్రేడింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పలువురిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం సాయంత్రం వెల్లడించారు. వీరిలో చార్టెడ్ అకౌంటెంట్ సహా 36 మంది సైబర్ నేరస్తులు ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీరిలో ఏడుగురు దేశవ్యాప్తంగా పలు కేసుల్లో కీలక నిందితులుగా ఉన్నట్లు ఆయన వివరించారు.
నిందితులపై దేశ వ్యాప్తంగా కేసులు
పెట్టుబడులు పేరుతో మోసాల్లో 11 మంది, ట్రేడింగ్ మోసంలో నలుగురు, కేవైసీ మాసంలో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ నిందితులు అందరిపైనా దేశవ్యాప్తంగా 983 కేసులు ఉన్నట్లు సిపి వెల్లడించారు. మిగిలిన అంశాలను దర్యాప్తు బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని సిపి వివరించారు. మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం ఉన్నట్లు స్పష్టం చేశారు. సైబర్ నేరాలకు పాల్పడి కోట్లాది రూపాయలను కొల్లగొట్టారని వివరించారు. నిందితులను ప్రత్యేక ఆపరేషన్ ద్వారా గుజరాత్ లో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరంతా అక్కడి నుంచే అమాయకులను అధిక లాభాలు పేరుతో మోసం చేస్తున్నట్లు సిపి వివరించారు. పలు ఫిర్యాదులు నేపథ్యంలోనే వాళ్ల పని నిందితులను అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు.
తెలంగాణలో వీరుపై 150 వరకు కేసులు ఉన్నాయని, వీటిలో హైదరాబాద్ పరిధిలోనే 20 కేసులు నమోదయినట్లు వివరించారు. ఈ 20 కేసుల్లోనే వీరు సుమారు 12 కోట్లకు పైగా మోసం చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. దోచుకున్న నగదులో ఇప్పటికే రూ.4.4 కోట్లు ఫ్రీజ్ చేశామని, ఫ్రీజ్ చేసిన డబ్బులు రూ.1.5 కోట్లు బాధితులకు తిరిగి అందించామని వెల్లడించారు. వీరిని అరెస్టు చేసిన సమయంలో నిందితుల నుంచి రూ.38 లక్షలు నగదు, బంగారం, ల్యాప్టాప్, బ్యాంక్ చెక్ బుక్, పాస్ బుక్స్ సీజ్ చేశామని, షెల్ కంపెనీలకు చెందిన నకిలీ స్టాంపులను షీట్ చేసినట్లు సిపి వెల్లడించారు.
ట్రేడింగ్ పేరుతో మోసం చేసిన ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్ నగరంలో ట్రేడింగ్ పేరుతో మోసాలు చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సిపి వెల్లడించారు. కనాని, నికుంజ్ సహా కిషోర్ భాయ్ అనే చార్టెడ్ అకౌంటెంట్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ముందుగా నిందితులు మోతిలాల్ ఓష్వాల్ సెక్యూరిటీ పేరుతో టెలిగ్రామ్ లో లింక్ చేస్తారని, అందులో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని ట్రేడింగ్ పేరుతో నమ్మించి రూ.61 లక్షలు కాజేశారని, బాధితుడు డబ్బులు పంపిన అకౌంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు సిపి తెలిపారు. ఈ ముగ్గురిపైన 142 ఫిర్యాదులు ఎన్సీఆర్పీలో నమోదు అయినట్లు గుర్తించారు. వీరిని అరెస్టు చేసిన సమయంలో మొబైల్ బ్యాంకు, డెబిట్ కార్డ్, పాస్ బుక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దర్యాప్తు కొనసాగుతున్న ఫోన్ టాపింగ్ కేసు
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉందని సిపి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితులను అరెస్టు చేయడంతోపాటు ఆధారాలను సేకరించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిబిఐ డైరెక్టర్ ను కోరినట్లు వెల్లడించారు. సిబిఐ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసిన తర్వాత వారిని దేశానికి తీసుకురానున్నట్లు తెలిపారు ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ విచారిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించామని, మరింత మంది ఈ వ్యవహారంలో ఉన్నవాళ్లు బయటకు వస్తారని ఆయన తెలిపారు. కేసు విచారణ కూడా సాగుతోందని, తదుపరి వివరాలను తెలియజేస్తామన్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రభుత్వం సీరియస్ గానే ఉన్నట్లు తెలిపారు.
మరిన్ని చూడండి