Telangana Election 2023: కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లిలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కొత్తపల్లికి చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలు ఓటర్ల స్లిప్పుల్లో డబ్బులు పంచుతుండగా అడ్డుకున్నామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. తమను అడ్డుకున్న బీజేపీ శ్రేణులతో బీఆర్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు. వాగ్వాదం ముదిరి రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అంత డైరెక్టుగా డబ్బులు పంచుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ శ్రేణులు పట్టుకున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బండి సంజయ్ వాపోయారు. ఇంత బాహాటంగా డబ్బులు పంచుతుంటే ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలసి బండి సంజయ్ అక్కడ ధర్నాకు దిగారు. బండి ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది సమాచారం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు కొత్తపల్లికి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఆరోపణలు, విమర్శలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం కనిపించింది. పోలీసుల రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిస్సిగ్గుగా ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపల్లిలో తనను కలిసిన మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. తాను పోలింగ్ ప్రచారం ముగిశాక మా స్థానిక నాయకుడు వాసాల రమేశ్ నివాసానికి టీ తాగేందుకు వెళ్లిన… అక్కడికి వెళ్లాక మా కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు కొత్తపల్లిలో డబ్బులు పంచుతున్నారని సమాచారం ఇచ్చారు. దాదాపు 3 గంటల నుండి అడ్డగోలుగా డబ్బులు పంచుతుంటే మా కార్యకర్తలు అడ్డుకుంటే మా వాళ్లపై దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
నిస్సిగ్గుగా ఓటర్ లిస్టు పట్టుకుని ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తూ… డబ్బులు ఇచ్చిన తరువాత ఆ లిస్ట్ పై పెయిడ్ అని రాసుకుంటూ ఇంటింటికీ తిరుగుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రశ్నించారు. పెట్రోలింగ్ వెహికల్స్ ఏమయ్యాయి. పోలీసులు బీఆర్ఎస్ తొత్తలుగా మారుతున్నారా అని నిలదీశారు. కరీంనగర్ రూరల్ లో పోలీసులే డబ్బులు పంచుతున్నరు అని ఆరోపించారు. తాను వచ్చి గంటసేపు అయినా ఇంకా ఎక్కడ చూసినా డబ్బులు పంచుతున్నారు. దాదాపు రూ. 5 కోట్లు డబ్బులు పంచుతున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ పూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నప్పటికీ… కిందిస్థాయి సిబ్బంది మాత్రం బీఆర్ఎస్ తొత్తులుగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు, రేపు అప్రమత్తంగా ఉండండి..
బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని.. ఈరోజు, రేపు బీజేపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని బండి సంజయ్ సూచించారు. ఎవరూ నిద్రపోవద్దని, కంటి మీద కునుకు లేకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈరోజు, రేపు అప్రమత్తంగా ఉండాలని… పోలీసులు పట్టించుకోకుంటే మీరే పెట్రోలింగ్ చేయండి అని సూచించారు. ప్రతి కార్యకర్త పోలీసులా మారాలని, బీఆర్ఎస్ నేతల డబ్బులు పట్టుకోండి అని పిలునిచ్చారు. అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును పట్టుకుని పేదలకు పంచాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం అన్నారు.