Pawan Kalyan In Kondagattu: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో కొండగట్టు చేరుకోనున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్‌లోని ఇంటి నుంచి కొండగట్టుకు రోడ్డు మార్గంలో బయల్దేరి వెళ్లనున్నారు.
పవన్ కల్యాణ్‌కు కొండగట్టు అంటే ప్రత్యేక భక్తి భావం ఉంది. 2008లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అక్కడ ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. 2024 ఎన్నికల ముందు చేపట్టిన వారాహి యాత్ర కూడా అక్కడి నుంచే మొదలు పెట్టారు. ఆ తర్వాత దానిపైనే ఎన్నికల్లో ప్రచారం చేయడమేకాకుండా ఘనవిజయం సాధించారు. అందుకే ఆయనకు మొక్కులు తీర్చుకోవడానికి కొండగట్టు అంజన్న సన్నిదికి వెళ్తున్నారు.
2023 జనవరి 24న కొండగట్టు సందర్శించుకున్న జనసేన ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే తొలిసారిగా పొత్తులపై కీలక ప్రకనట చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తామని అనడం సంచలనంగా మారింది. పొత్తులు ఉంటాయని పవన్ ఇచ్చిన సంకేతాలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. అక్కడి నుంచి మొదలైన పవన్ ప్రచారం 2024 ఎన్నికల్లో విజయం సాధించే వరకు సాగింది.
అందుకే ఆనాడు ప్రభుత్వ మార్పు ఖాయమని చెప్పిన పవన్ కల్యాణ్ ఆ మార్పు చేసి చూపించారు. అంజన్న సాక్షిగా చేసిన శపథం నెరవేరినందున మొక్కులు తీర్చుకోనున్నారు. ప్రత్యేక పూజలు చేయనున్నారు. అప్పుడు జనసేన అధినేతగా కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ నేడు డిప్యూటీ సీఎంగా దేవుడికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలవడమే కాదు… తన పార్టీ తరుఫున పోటీ చేసిన 23 మందిని కూడా గెలిపించుకున్నారు. కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. కూటమి అధికారంలోకి రాగానే డిప్యూటీ సీంగా, గ్రామీణాభివృద్ధి, వాటర్ సప్లై, అటవీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇంతటి విజయానికి అంజన్న ఆశీస్సులే కారణమని భావిస్తున్న పవన్ ఇవాళ మొక్కులు తీర్చుకున్నారు.
ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారం చేస్తున్నటైంలో పవన్ కల్యాణ్‌కు ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లాలో ప్రచారం చేస్తున్న టైంలో విద్యుత్ షాక్‌కి గురయ్యారు. తీగలు తగలడంతో స్పృహ తప్పి పడిపోయారు. ప్రాణాపాయం నుంచి తనను అంజన్నే కాపాడాడని నమ్మిన పవన్ కల్యాణ్ అప్పటి నుంచే పని అయినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే మొదలు పెడతారు.
పవన్ కల్యాణ్ కొండగట్టుకు వస్తున్నారని తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు కూడా కొండగట్టుకు రానున్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయనున్నాయి. అంతా ఆయన ఘన స్వాగతం పలకనున్నారని తెలుస్తోంది.
భారీ సంఖ్యలో అభిమానులు ప్రజలు కొండగట్టు రానున్న వేళ కరీంనగర్ జిల్లా పోలీసులు ప్రత్యేక ఏర్పాట‌్లు చేశారు. సామాన్యులకు పవన్ టూర్‌తో ఇబ్బంది లేకుండా ఉండేలా ప్లాన్ చేశారు. ఉదయం పదకొండు గంటలకు మొదలు కానున్న పవన్ కొండగట్టు యాత్ర సాయంత్ర ఐదు గంటలకు ముగియనుంది.
మరిన్ని చూడండి