Latest Telugu Breaking News: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, వివిధ శాఖల మంత్రులుగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9 గంటలకు విజయవాడ క్యాంపు ఆఫీసులో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారు. తర్వాత 11 గంటలకు ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులతో సమావేశమవుతారు. 12 గంటలకు గ్రూప్ 1 ,2 అధికారులతో భేటీ అవుతారు. 12:30 గంటలకు పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో సమీక్ష ఉంటుంది.
ఎమ్మెల్యే ఎన్నికై, మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి సచివాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి వెలగపూడి సచివాలయం వరకు పూల వర్షం కురిపించారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసుల ఆంక్షలు దాటుకొని వెళ్లి మరీ రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. అలాంటి ఘటనలు గుర్తు చేసుకున్న రైతులు పవన్ కల్యాణ్‌కు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. నినాదాలు చేశారు. మోకాళ్లపై నిల్చొని పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా జనంతో నిండిపోయిన ఆరు కిలోమీటర్లు రహదారి దాటుకొని సచివాలయానికి చేరుకోవడానికి పవన్‌కు గంటకుపైగా సమయం పట్టింది.
తొలిసారి సచివాలయానికి వచ్చి పవన్ కల్యాణ్ ముందుగా తన ఛాంబర్ చూడకుండానే నేరుగా సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సీఎం కార్యాలయానికి వెళ్లిన పవన్‌ను చంద్రబాబు ఎదురువచ్చి ఆహ్వానించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వీళ్లిద్దరు దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఇందులో 45 నిమిషాలు ఏకాంతంగా పలు అంశాలపై చర్చించుకున్నారు.
పవన్ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న సచివాలయ ఉద్యోగులు, ఆ ప్రాంత ప్రజలు భారీగా చేరుకున్నారు. దీంతో పవన్ కేటాయించిన బ్లాక్ మొత్తం నిండిపోయింది. వాళ్లందరికీ అభివాదం చేస్తూ అడిగిన వారికి సెల్ఫీలు ఇస్తూ పవన్ కల్యాణ్ తన ఛాంబర్‌ను పరిశీలించారు.