Allu Arjun : పుష్ప 2 ది రూల్ విడుదలైనప్పట్నుంచి మూవీ సక్సెస్ మాట పక్కనపెడితే ఆ మూవీ హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. డిసెంబర్ 4 నుంచి బన్నీ ఎపిసోడ్ రోజుకో ట్విస్టుతో ఊహించని మలుపులు తిరుగుతోంది. సినిమా రంగాన్నే కాదు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైన ఈ వివాదాన్ని కూల్ చేేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ నడుస్తోంది. అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో సమావేశమయ్యారు.
సంధ్య థియేటర్ కేసులో ప్రభుత్వం వర్శెస్ అల్లు అర్జున్ అన్నట్టు సాగుతోంది. ఈ టాపిక్ పై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని చంద్రశేఖర రెడ్డి గాంధీ నగర్ లో కలిశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో ఉన్నారని తెలుసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మహేశ్ కుమార్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు తాను మీడియా సమావేశంలో ఉన్నానని, దీపాదాస్ మున్షీని కలిసి వెళ్లారన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంపై మాట్లాడదామని చెప్పినట్టు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
#AlluArjun’s father-in-law, Kancharla Chandrasekhar Reddy, a #Congress leader, met with AICC in-charge Deepa Das Munshi at Gandhi Bhavan in Hyderabad Today. pic.twitter.com/36C10wRDfZ
— Sandeep Athreya (@AthreyaSpeaks) December 23, 2024
ఇటీవల పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిందని, ఆమె కుమారుడు ఆస్పత్రిలో ఉన్నారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ విషయంపై రాజకీయ లబ్ధి పొందేందుకు తెలుగు చిత్రసీమ చర్రిత తెలియనివాళ్లు మాట్లాడుతున్నారని అన్నారు. తెలుగు చిత్రసీమ హైదరాబాద్ ఎలా వచ్చిందో బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లకు తెలుసా అని నిలదీశారు. పుష్ప- 2కు కూడా వెసులుబాటు ఇచ్చింది తమ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. రాజకీయ నాయకులెవరైనా సరే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.
గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన శేఖర్ రెడ్డి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరారు. 2023 ఎన్నికల్లో సీటు కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారు. అప్పట్లో శేఖర్ రెడ్డికి సీటు ఇస్తే అల్లు అర్జున్ ప్రచారం చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ, శేఖర్ రెడ్డికి సీటు రాలేదు. ఇటీవలి కాలంలో అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత శేఖర్ రెడ్డి మనస్థాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఇక ఈ వివాదం మున్ముందు ఇంకెంత ముదురుతుందోనని అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
మరిన్ని చూడండి