TTD Press Note On Fake Information: తిరుమలలో అపచారం జరిగిందన్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) స్పందించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా కొక్కి విరిగిందని.. అపశ్రుతి చోటు చేసుకుందని వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తిరుమలలో (Tirumala) ఎలాంటి అపచారం జరగలేదని.. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మొద్దని ఓ ప్రకటనలో తెలిపింది. ‘ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని సోషల్ మీడియాలో విస్తృతంగా వదంతులు వస్తున్నాయి. శ్రీవారి భక్తులు ఇలాంటి వార్తలు నమ్మొద్దు. సాధారణంగా బ్రహ్మోత్సవాలకు ముందే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసుకోవడం ఆనవాయితీ. అవసరమైతే వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చడం సంప్రదాయం. అందులో భాగంగానే భిన్నమైన ధ్వజపటం తాలూకు కొక్కిని అర్చకులు తొలగించి దాని స్థానంలో కొత్త దాన్ని ఏర్పాటు చేశారు. అంతలోపే దీన్ని అపచారం జరిగినట్లుగా కొన్ని ప్రసార మాధ్యమాలు ప్రసారం చేయడం దురదృష్టకరం. తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదు.’ అని టీటీడీ స్పష్టం చేసింది.
ఇదీ ప్రచారం
కాగా, ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయం. ఈ సందర్భంగా శ్రీవారి వివిధ వాహనాల్లో మాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ గరుడ పటాన్ని ఎగురవేసే ధ్వజస్తంభం పై భాగంలో ఉండే ఇనుప కొక్కి విరిగిందంటూ శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కొక్కి విరగడంతో ముందుగా గుర్తించిన టీటీడీ అధికారులు మరమ్మతులు చేస్తున్నారంటూ వదంతులు వచ్చాయి. తాజాగా, అదంతా అసత్య ప్రచారమని టీటీడీ క్లారిటీ ఇచ్చింది.
మరిన్ని చూడండి