Harish Rao Anger On CM Revanth Reddy: తెలంగాణలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు (Harishrao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క చాన్స్, మార్పు అంటూ అధికారం చేజిక్కించుకుని రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటం తప్పించి మరే మార్పు తీసుకురాలేదని దుయ్యబట్టారు. నిర్భందాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప రేవంత్ తెచ్చిన మార్పు ఏమీ లేదని విమర్శించారు. గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
గొంతు నొక్కాలని చూస్తున్నారు..
సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో వివిధ వర్గాలు అష్టకష్టాలు పడుతున్నాయని విమర్శించారు. నిరుద్యోగ యువతకు జాబుల గురించి మాట ఇచ్చారో.. అదే నిరుద్యోగుల వీపులు కమిలిపోయేట్టు అశోక్‌నగర్‌లో కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి గిరిజనులపై దాడి చేసి జైళ్లల్లో నిర్బంధించారని, రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ హయాంలోని ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు. పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదని, ఇందిరమ్మ లాంటివాళ్లను కూడా కూకటివేళ్లతో ప్రజలు పెకిలించి వేశారని గుర్తు చేశారు.
ఇక పోలీసుల తీరుపైనా హరీష్ రావు ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఎఫ్‌ఐఆర్‌లు పోలీస్ స్టేషన్లలో కాకుండా గాంధీభవన్‌లో తయారవుతున్నాయని, ఏ సెక్షన్లు పెట్టాలి.. ఎవరిని అరెస్టు చేయాలో గాంధీభవన్ నుంచి ఆదేశాలు వస్తున్నాయని విమర్శించారు. అధికారం ఎవరకీ శాశ్వతం కాదన్న విషయం రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు.
ఏడాది పాలనలో ఒక్క మంచి పనైనా లేదు..
సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో రాష్ట్రంలో ఎవరు కూడా బాగుపడలేదని హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏడో గ్యారంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని, పోలీసులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేయాలని హెచ్చరించారు. కానీ, రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పని చేస్తే భవిష్యత్‌లో ఇబ్బంది పడేది ఖాకీలేనని, ప్రతిపక్షంపై సీఎం పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన కొనసాగుతోందని ఘాటుగా విమర్శించారు. కాగా, బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రి హరీష్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావును సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
అరెస్టుపై హైకోర్టులో స్టే..
మరోవైపు.. హరీశ్‌రావు అరెస్టుపై హైకోర్టు స్టే విధించింది. తన అరెస్టును సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. పంజాగుట్టలో నమోదైన కేసులో హరీశ్‌రావును అరెస్టు చెయ్యవద్దని సూచించింది. కావాలంటే.. నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని జస్టిస్ లక్ష్మణ్ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. హైకోర్టు నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ తీర్పు చెంపపెట్టు అని పేర్కొంటున్నారు.
Also Read: Nizamabad News: బైక్‌తో రైలుకు ఎదురెళ్లాడు – గేట్ మ్యాన్ స్పందనతో ప్రాణాలు దక్కాయి, కట్ చేస్తే!
మరిన్ని చూడండి