Homeస్పెషల్ స్టోరీఈ 30లోపు నిర్ణయం, లేకపోతే ఒంటరిగానే పోటీ - పార్టీ విలీనంపై షర్మిల ప్రకటన

ఈ 30లోపు నిర్ణయం, లేకపోతే ఒంటరిగానే పోటీ – పార్టీ విలీనంపై షర్మిల ప్రకటన


YS Sharmila: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కొందరు పార్టీ మారుతుంటే, కొందరు టికెట్ రాలేదని సొంత పార్టీ నేతలపై వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. అధికార బీఆర్ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహలకు పదునుపెడుతోంది. అలాగే బీజేపీతో పాటు వైఎస్సార్‌టీపీ, మిగతా పార్టీలు కూడా ఎన్నికలకు సన్నద్దమవుతున్నాయి. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ అడుగులు ఎలా ఉంటాయనేది టీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని విలీనం చేస్తారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుండగా..  ఇప్పటివరకు ఇంకా అది జరగలేదు.

కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై సోమవారం వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. పార్టీ విలీనంపై ఈ నెల 30వ తేదీలోపు నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. విలీనం లేకపోతే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌టీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని తెలిపారు. ఒకవేళ విలీనం లేకపోతే తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సింగిల్‌గా పోటీ చేసేందుకు వైఎస్సార్‌టీపీ సిద్దంగా ఉందని చెప్పారు. కార్యకర్తలు, నేతలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడ్డవారికి సరైన ప్రాధాన్యత దక్కుతుందని షర్మిల పేర్కొన్నారు.

సోమవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌టీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్సార్‌టీపీ నేతలందరూ హాజరయ్యారు. షర్మిల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ విలీనం, భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలతో షర్మిల చర్చించారు. ఈ సందర్భంగా విలీనంపై ఈ నెల 30లోపు నిర్ణయం ఉంటుందని శ్రేణులకు తెలిపారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం దాదాపు ఖాయమనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది.  ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలను షర్మిల కలిశారు. వైఎస్సార్‌టీపీ విలీనంపై వారితో చర్చించారు. త్వరలోనే మరోసారి సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గేతో షర్మి సమావేశమయ్యే అవకాశముంది. అనంతరం కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.

విలీనంపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటానంటూ ఇటీవల వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలో షర్మిల ప్రకటించారు. ఆ తర్వాత ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ అయ్యారు. ఆ తర్వాత షర్మిల సైలెంట్ కావడంతో పార్టీ విలీనానికి బ్రేక్‌లు పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా  విలీనం లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తానని షర్మిల ప్రకటించడం కీలకంగా మారింది. దీంతో విలీనం ఉంటుందా..? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

 షర్మిలను ఏపీ రాజకీయాల్లో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ ఏపీకి వెళ్లేందుకు షర్మిల ఆసక్తి చూపించడం లేదు.  తెలంగాణలోనే రాజకీయాలు చేయాలని ఆమె భావిస్తోంది. పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన షర్మిల.. అక్కడ వైఎస్సార్‌టీపీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడంతో.. ఆయనకే కాంగ్రెస్ టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో షర్మిలకు కాంగ్రెస్ కర్ణాటక నుంచి రాజ్యసభ ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments