Nara Bhuvaneswari: కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అన్నవరం దేవస్థానానికి నారా భువనేశ్వరి తన కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు. అంతా కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తన భర్త అయిన చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల అవ్వాలని నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. అయితే దేవస్థాన సిబ్బంది.. మర్యాదపూర్వకంగా ఆమెకు ఘన స్వాగతం పలికారు. వారి వెంటే ఉండి దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చారు. ఉమ్మడి తూర్పు గోదావరి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ అన్నవరం దేవస్థానానికి చేరుకుని భువనేశ్వరి గారికి తమ సంఘీభావం తెలిపారు.
ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు నారా భువనేశ్వరి. అన్నవరంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె జగ్గంపేటలో నిర్వహిస్తున్న దీక్షల్లో పాల్గొన్నారు. వాళ్లకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భువనేశ్వరి… చంద్రబాబు అరెస్టును తప్పుపట్టారు. ఆయన ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తుంటారని అలాంటి వ్యక్తిని అరెస్టు చేయడం దారుణం అన్నారు. ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్న ఆమె… తాను స్వయంగా ఓ సంస్థను నడుపుతున్నానని పేర్కొన్నారు. ఆ సంస్థలో రెండు శాతం వాటా అమ్ముకున్నా 400 కోట్లు వస్తాయని తెలిపారు.
ప్రజల కోసం రాత్రి పగలు కష్టపడే వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు భవనేశ్వరి. అలాంటి వ్యక్తి తప్పులెందుకు చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం కష్టపడటమే ఆయన చేసిన తప్పా అని నిలదీశారు. రాళ్లతో కూడిన ప్రాంతాన్ని సైబరాబాద్‌లా మార్చారని అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
చంద్రబాబుపై అభిమానంతో ఆంధ్రప్రదేశ్ వస్తున్న వారిని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు భువనేశ్వరి. తెలంగాణ నుంచి వస్తున్న కార్ల ర్యాలీని అడ్డుకోవడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ రావాలంటే వీసాలు, పాస్‌పోర్టు తీసుకోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషేనని… ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదని అన్నారు.
Read Also: Chandrababu Custody Extends: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు