YS Sharmila Latest News: వైఎస్ షర్మిల.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు..! గడచిన ఏడాదిన్నరగా తన అన్న జగన్మోహన్ రెడ్డిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారమె. 2024 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థుల ఓటు బ్యాంకును ఏదో ఒక స్థాయిలో దెబ్బ కొట్టాలన్న ఆమె ప్రయత్నం కొంత మేర ఫలించింది. అయితే కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని ఓడించి పార్లమెంట్‌లో అడుగు పెట్టాలన్న ఆమె ప్రయత్నం మాత్రం వర్కౌట్ కాలేదు.
అన్న ఓటమి కోసం పోరాటం
వ్యక్తిగత జీవితంలో కుటుంబంపరంగా మోసపోయానన్న అభిప్రాయం షర్మిలది. తనకు రావాల్సిన ఆస్తి ఇవ్వకుండా అన్నయ్య జగన్ తనను మోసం చేశాడనేది ఆమె ఆరోపణ. పలు ఇంటర్వ్యూల్లో ఆమె విషయం పబ్లిక్‌గానే చెప్పారు. తన అన్నకు తనపై ప్రేమ ఉన్నా కొంతమంది చేతిలో కీలు బొమ్మగా మారాడు అని ఆమె చెబుతారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే అన్నకు ఎదురు వెళుతున్నట్టు చెప్పే షర్మిల 2024 ఎన్నికల్లో ముఖాముఖి పోరుకు తెర తీశారు. విభజన తర్వాత ఏపీలో పూర్తిగా అడుగంటిపోయిన కాంగ్రెస్‌కు కనీస ఉనికి వచ్చిందంటే షర్మిలే కారణం. తనకు సోదరుడయ్యే అవినాష్ రెడ్డిపై గెలుపు కోసం ఆమె కడప నుంచి ఎంపీగా పోటీ చేశారు. కొద్దిలో ఓటమి పాలయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అద్భుతాలు చేస్తుందని ఎవరూ భావించనప్పటికీ కనీసం కొన్ని సీట్లు అయినా తెచ్చుకుంటుందేమో నేతలు ఆశించారు. కానీ వైసీపీ వర్సెస్ కూటమి అంటూ జరిగిన భీకర పోరులో కాంగ్రెస్ గల్లంతైంది. పైపెచ్చు రాష్ట్ర విభజన జరిగిన విధానంపై ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ హై కమాండ్ పై కోపం ఇంకా తగ్గలేదు అని 2024 ఎన్నికలు రుజువు చేశాయి.
కలిసి రాని పార్టీ నేతలు
షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రావడం ఆ పార్టీలోని కొందరు నేతలకు నచ్చలేదు. దానితో వారు ఆమెపై సోషల్ మీడియా వేదికగా అనేక అరోపణలు చేశారు. ఒకరిద్దరు పార్టీని వీడియో ప్రయత్నమూ చేశారు. పార్టీ హైకమాండ్ మాత్రం షర్మిలపై విశ్వాసం ఉంచింది. దానికి తగ్గట్టే ఆమె గట్టిగా పని చేశారు. కానీ ఇప్పటికీ ఆమెపై అసంతృప్తిని వెళ్లగక్కే నాయకులు సొంత పార్టీలోనే ఉన్నారు అని షర్మిల వర్గం చెబుతోంది.
షర్మిల రాజకీయాలకు ప్లస్సు అదే.. మైనస్సు అదే
షర్మిల ఏపీ రాజకీయాలకు రావడంతోనే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్ ఫైట్‌కి రెడీ అయ్యారు. 2024 ఎన్నికల తర్వాత కూడా ఆమె కంటిన్యూ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఆమె పోరాటం అంతా అన్నా చెల్లెళ్ల ఆస్తి పోరాటంగానే ప్రాజెక్ట్ అవుతోంది. దానితో ఆమె ప్లాన్ మార్చి కూటమి నేతలను టార్గెట్ చేస్తున్నారు.
ప్రధానంగా కూటమి నేతలు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అంటూ షర్మిల నిలదీస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు పథకం వెంటనే అమలు చేయాలంటూ చేసిన నిరసనలకు జనంలో గుర్తింపు వచ్చింది. అయితే షర్మిల అనగానే కొండ లాంటి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టిన చెల్లెలు గానే ఇప్పటికీ రాజకీయాల్లో చూస్తున్నారు. ఆమెకున్న పెద్ద ప్లస్ ఇదే మైనస్సు ఇదే.
అయితే ఏపిలో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిన కాంగ్రెస్‌కు 2024 ఎన్నికల్లో 1.72 శాతం లభించింది అంటే అది షర్మిల ఎఫెక్ట్ అనే చెప్పాలి. కొత్త ఏడాదిలో ప్రజాసమస్యలపై మరింత పోరాటం చేయడానికి రెడీ అని అంటున్నారు షర్మిల. మరి ఆమె ప్రయత్నాలు ఏమేర ఫలిస్థాయో చూడాలి.
మరిన్ని చూడండి