Homeస్పెషల్ స్టోరీఅద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు

అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ – ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు


RCB vs CSK Match highlights:  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌(IPL) చరిత్రలోనే అరుదైన ఘనతను సాధించింది. వరుసగా ఆరు మ్యాచుల్లో విజయం సాధించి.. ప్లే ఆఫ్‌కు అర్హత సాధించి అద్భుతం చేసింది. వరుసగా అయిదు మ్యాచుల్లో పరాజయం పాలై… ప్లే ఆఫ్‌ ఆశలు పూర్తిగా మూసుకుపోయిన వేళ…. వరుస విజయాలతో బెంగళూరు అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

తప్పక ఘన విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నైను మట్టికరిపించి ప్లే ఆఫ్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు విధించిన 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై(CSK) ఏడు వికెట్లకు 191 పరుగులే చేసింది. 200 పరుగులు చేస్తే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించే అవకాశం ఉన్న దశలో చెన్నై కేవలం 191 పరుగులకే పరిమితమైంది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ అని భావిస్తున్న వేళ తలా అభిమానులకు నిర్వేదాన్ని మిగులుస్తూ ఈ మెగా టోర్నీ నుంచి చెన్నై రిక్త హస్తాలతో వెనుదిరిగింది. 

 

రాణించిన బ్యాటర్లు

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌… బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కీలకమైన మ్యాచ్‌లో బెంగళూరు టాపార్డర్‌లోని బ్యాటర్లు అందరూ రాణించారు. తొలి వికెట్‌కు బెంగళూరు ఓపెనర్లు విరాట్‌ కోహ్లీ-ఫాఫ్‌ డుప్లెసిస్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ మంచి టచ్‌లో కనిపించాడు. ఆరంభం నుంచే కోహ్లీ ధాటిగా బ్యాటింగ్‌ చేసి చెన్నై బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన రెండో ఓవర్‌లో 16 పరుగులు పరుగులు వచ్చాయి. దేశ్‌పాండే బౌలింగ్‌లో మంచి సిక్స్‌ కొట్టిన కోహ్లీ భారీ స్కోరుకు బాటలు వేశాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో స్కోరు మూడు ఓవర్లకు 31 పరుగులు చేసిన దశలో వర్షం పడడంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత వరుణుడు కరుణించడంతో ఆట మళ్లీ ప్రారంభమైంది. పవర్‌ ప్లే ముగిసే సరికి బెంగళూరు ఒక్క వికెట్‌ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. తొమ్మిది ఓవర్లకు 71 పరుగులు చేసింది.

 

పది ఓవర్లకు 78 పరుగులు ఉన్నప్పుడు బెంగళూరు తొలి వికెట్‌ కోల్పోయింది. 29 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సులతో 47 పరుగులు చేసి విరాట్‌ కోహ్లీ అవుటయ్యాడు. శాంట్నర్‌ బౌలింగ్‌లో కోహ్లీ అవుటయ్యాడు. కోహ్లీ అవుటైన తర్వాత డుప్లెసిస్‌తో జత కలిసిన రజత్‌ పాటిదార్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 39 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 54 పరుగులు చేసిన డుప్లెసిస్‌… దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. రజత్‌ పాటిదార్‌ కొట్టిన బంతి బౌలర్‌ చేతికి తగిలి వికెట్లకు తగలడంతో డుప్లెసిస్‌ పెవిలియన్‌ చేరాడు. కోహ్లీ-డుప్లెసిస్‌ అవుటైన తర్వాత రజత్‌ పాటిదార్‌-కామెరూన్‌ గ్రీన్‌ బెంగళూరు స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. 23 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 41 పరుగులు చేసి రజత్‌ పాటిదార్‌ అవుటయ్యాడు. రజత్‌ పాటిదార్‌… శార్దూల్‌ ఠాకూర్ అవుట్‌ చేశాడు.  రజత్‌ పాటిదార్‌ అవుటైనా కామెరూన్‌ గ్రీన్‌ ధాటిగా ఆడాడు. 17  బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో గ్రీన్ 38  పరుగులు చేశాడు.  బెంగళూరు టాపార్డర్‌ రాణించడంతోబెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. 

 

చెన్నై పోరాడినా

219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చె‌న్నైకు తొలి బంతికే షాక్‌ తగిలింది. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికే మంచి ఫామ్‌లో ఉన్న రుతురాజ్‌ గైక్వాడ్‌ వెనుదిరిగాడు. దీంతో చెన్నైకు గట్టి షాక్‌ తగిలింది. తర్వాతి ఓవర్‌లోనే డారిల్‌ మిచెల్‌ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత రచిన్‌ రవీంద్ర, అజింక్యా రహానే మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. చూడముచ్చని షాట్లతో చెన్నై స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఒక దశలో చెన్నై విజయం ఖాయంలా కనిపించింది. కానీ 37 బంతుల్లో 61 పరుగులు చేసిన రచిన్‌ రవీంద్ర రనౌట్‌ అవ్వడం చెన్నై విజయావకాశాలను దెబ్బ తీసింది. రహానే 22 బంతుల్లో 33 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. చివర్లో ధోనీ, రవీంద్ర జడేజా పోరాడడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. జడేజా 22 బంతుల్లో 42, ధోనీ 13 బంతుల్లో 25 పరుగులు చేయడంతో… బెంగళూరు గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.

చివరి ఓవర్లో చెన్నై ప్లే ఆఫ్‌కు చేరేందుకు 17 పరుగులు చేయాల్సి ఉండగా… ధోనీ తొలి బంతికే సిక్సర్‌ బాదాడు. దీంతో 5 బంతులకు 11 పరుగులే చేయాల్సి రావడంతో లక్ష్యం తేలిగ్గా కనిపించింది. కానీ యష్‌ దయాల్‌ తెలివైన బంతితో ధోనీని బోల్తా కొట్టించడంతో మ్యాచ్‌ స్వరూపం మారిపోయింది. తెలివైన బంతులతో యశ్‌ దయాల్‌… రవీంద్ర జడేజాను కట్టడి చేశాడు. చివరి అయిదు బంతుల్లో కేవలం ఒకే పరుగు ఇచ్చిన యశ్‌ దయాల్‌… బెంగళూరు ఆశలను నిజం చేశాడు.

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments