Ram Charan – Allu Arjun: ఆంధ్రప్రదేశ్‍లో ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ఆసక్తికర విషయాలు జరిగాయి. జనసేన అధినేత, తన బాబాయ్ పవన్ కల్యాణ్‍కు మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్.. పిఠాపురం వెళ్లారు. పవన్ ఇంటికి వెళ్లి కలిశారు. వీరిని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలు వచ్చారు. మరోవైపు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కర్నూలు జిల్లాలోని నంద్యాలకు వెళ్లారు. వైఎస్‍ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవీంద్ర కిశోర్ రెడ్డికు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మోత మోగుతున్నాయి.
పవన్‍తో రామ్‍చరణ్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన నేడు (మే 11) పిఠాపురం వెళ్లారు రామ్‍చరణ్. ముందుగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న చెర్రీకి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత రాజమండ్రి నుంచి పిఠాపురం వెళ్లారు. అక్కడ కూడా రామ్‍చరణ్‍కు మెగా ఫ్యాన్స్ గ్రాండ్ వెల్‍కమ్ చెప్పారు.
అనంతరం తన బాబాయ్ పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు రామ్‍చరణ్. ఆ తర్వాత ఇంటి వద్దకు భారీగా వచ్చిన అభిమానులకు పవన్, చరణ్ కలిసి అభివాదం చేశారు. కేకలు, ఈలలతో ఫ్యాన్స్ మోతమోగించారు.
యువసేనాని అంటూ..
రామ్‍చరణ్‍కు యువసేనాని అనే పొలిటికల్ ట్యాగ్‍ను నెటిజన్లు ఇచ్చేశారు. జనసేనాని కోసం యువసేనాని అంటూ సోషల్ మీడియాలో మోతెక్కిస్తున్నారు. పిఠాపురంలో రామ్‍చరణ్ టూర్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.