Actor Vishal Health News: గత రెండు మూడు రోజుల నుంచి నటుడు విశాల్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విశాల్ ఆ రూమర్స్ పై స్పందిస్తూ ‘ఆరోగ్యంగానే ఉన్నాను’ అని చెప్పుకొచ్చారు. శనివారం సాయంత్రం జరిగిన ‘మద గజ రాజా’ మూవీ ప్రీమియర్ సందర్భంగా ఆయన తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు.
విశాల్ హెల్త్ అప్డేట్
ఇటీవల విశాల్ తన సినిమా ఈవెంట్లో కనిపించిన తీరు అందరికీ షాక్ కి ఇచ్చింది. ఆయన చేతులు వణకడం, కనీసం ఆయన సరిగ్గా మాట్లాడలేకపోవడం, మైక్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడడం చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి విశాల్ కి ఆరోగ్యం బాగాలేదనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే విశాల్ జ్వరం కారణంగా అలా కనిపించడంతో, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తాజాగా ‘మద గజ రాజా’ మూవీ ప్రీమియర్ల సందర్భంగా విశాల్ మాట్లాడుతూ “నా తండ్రి వల్లే నేను ధైర్యంగా ఉన్నాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కుంగిపోకుండా, తట్టుకుని నిలబడుతున్నాను అంటే ఆయనే కారణం.
ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే… 3 లేదా 6 నెలలకు ఒకసారి విశ్రాంతి పేరుతో వెళ్ళిపోతున్నానని అంటున్నారు. కానీ ప్రస్తుతం నాకు ఎలాంటి సమస్యలు లేవు. హెల్త్ బాగానే ఉంది. ఇప్పుడు నా చేతులు వణకడం లేదు. అలాగే మైక్ కూడా బాగానే పట్టుకుంటున్నాను చూడండి. రీసెంట్ గా మీరు చూపించిన ప్రేమ, అభిమానాలకు కృతజ్ఞతలు. గెట్ వెల్ సూట్, కం బ్యాక్ అంటూ మీరు పెట్టిన సందేశాలే నన్ను కోలుకునేలా చేశాయి. నా తుది శ్వాస వరకు మీ అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోను” అంటూ విశాల్ ఎమోషనల్ అయ్యారు.
12 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి…
ఇక విశాల్ హీరోగా నటించిన ‘మద గజ రాజా’ మూవీ పన్నెండేళ్ల క్రితమే పూర్తయింది. కానీ పలు కారణాల వల్ల అటకెక్కిన ఈ మూవీ ఎట్టకేలకు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుందర్ సి ‘మద గజ రాజా’ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో విశాల్ హీరోగా నటించగా, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా గత వారం చెన్నైలో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ లో పాల్గొన్న టైంలోనే విశాల్ చేతులు వణకడంతో పాటు నీరసంగా కనిపించాడు. దీంతో అభిమానులు కంగారు పడ్డారు.
అయితే విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని యాంకర్ చెప్పగా, ఆ వీడియోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని విశాల్ టీం వైద్యుల రిపోర్ట్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి విశాల్ ఫీవర్ నుంచి కోలుకుని, హెల్దీగా ఉండడంతో ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని చూడండి