Rao Ramesh’s Maruthi Nagar Subramanyam Movie Review In Telugu: రావు రమేష్ నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తనదైన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. ఆయన తొలిసారి కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’. ఆయన భార్యగా ఇంద్రజ, తనయుడిగా అంకిత్ కొయ్య నటించారు. రమ్య పసుపులేటి హీరోయిన్. హర్షవర్ధన్, బిందు, ప్రవీణ్ కీలక పాత్రలు పోషించారు. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు. ఈ సినిమా ఎలా ఉంది? అనేది చూడండి.
కథ (Maruthi Nagar Subramanyam Story): ప్రభుత్వ ఉద్యోగం మారుతి నగర్ వాసి సుబ్రమణ్యం (రావు రమేష్) కల. ఒక్క పోలీసు ఉద్యోగానికి తప్ప మిగతా అన్ని పోటీ పరీక్షలు రాస్తాడు. టీచర్ జాబ్ వచ్చినా కోర్టు స్టే వల్ల పెండింగ్‌లో పడుతుంది. ఆ తర్వాత నుంచి ఉద్యోగం చేయడు. పాతికేళ్లుగా భార్య కళా రాణి (ఇంద్రజ) ఉద్యోగం చేస్తూ కుటుంబ బరువు బాధ్యతలు మోస్తుంటే… సంతోషంగా గడిపేస్తాడు.
భార్యకు తెలియకుండా అత్తగారు (అన్నపూర్ణమ్మ) దాచిన డబ్బును సుబ్రమణ్యం ఖర్చు పెట్టేస్తాడు. తల్లి మరణించిన తర్వాత కళారాణికి విషయం తెలిసి గట్టిగా తిడుతుంది. అమ్మ ఆఖరి కోరిక మేరకు అస్థికలు పుణ్యనదుల్లో కలపడానికి వెళుతుంది. ఆ సమయంలో సుబ్రమణ్యం ఖాతాలో పది లక్షల రూపాయలు పడతాయి.
సుబ్రమణ్యం ఖాతాలో పది లక్షలు వేసినది ఎవరు? ఆ డబ్బు ఏం చేశాడు? అల్లు అరవింద్ కొడుకును అని ఫీలయ్యే సుబ్రమణ్యం కన్న కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య) ఏం చేశాడు? అర్జున్ ప్రేమించిన అమ్మాయి కాంచన (రమ్య పసుపులేటి) కథేంటి? ఆమె తండ్రి భాస్కర్ (హర్షవర్ధన్) ఏం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Maruthi Nagar Subramanyam Review Telugu): ప్రేక్షకుల్ని నవ్వించడం కోసం తీసిన సినిమా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’. ఆ ప్రయత్నం తొలి సన్నివేశం నుంచి కనపడింది. లాజిక్ కంటే మెజారిటీ సన్నివేశాల్లో మేజిక్ వర్కవుట్ కావడం సినిమాకు ప్లస్ పాయింట్. దర్శకుడు లక్ష్మణ్ కార్య రైటింగ్‌లో కామెడీ టింజ్ బావుంది. బి, సి సెంటర్స్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది.
‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాకు వస్తే… అంతుచిక్కని కథ, కథనాలు ఏమీ లేవు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దర్శకుడిగా, కథకుడిగా లక్ష్మణ్ కార్య జస్ట్ కామెడీ మీద కాన్సంట్రేట్ చేశారు. అలాగని ఎమోషన్స్ లేవని కాదు, ఉన్నాయి. కానీ, వాటిని కూడా కామెడీ డామినేట్ చేసింది. ఇంటర్వెల్ వరకు కథ ముందుకు కదిలింది తక్కువ. కానీ, కామెడీతో సాఫీగా సాగింది. ఇంటర్వెల్ తర్వాత లక్ష్మణ్ కార్య ఎమోషన్స్ మీద దృష్టి సారించారు. అయితే… కామెడీ, ఎమోషన్స్ మధ్య ట్రాన్సిషన్‌లో తడబాటు కనిపించింది. కీలమైన ఎమోషన్స్ కొన్నిటిని త్వరగా ఫినిష్ చేశారు. పది లక్షల కోసం బ్యాంకు అధికారులు పోలీసులను వెంటబెట్టుకుని రావడం వంటివి వాస్తవానికి దూరంగా ఉన్నా… కామెడీలో కొట్టుకుపోలేదు. ప్రవీణ్, జబర్దస్త్ నూకరాజు సన్నివేశాలు నిడివి పెంచాయి తప్ప అక్కడ కామెడీ వర్కవుట్ కాలేదు. అలాగే, ఓఎల్‌ఎక్స్ మోసాలపై తీసిన సన్నివేశం కూడా!
రావు రమేష్ క్యారెక్టర్, ఆయన నటన మాస్ జనాలకు ఎక్కువ నచ్చుతుంది. ఇక అంకిత్ కొయ్య – రమ్య పసుపులేటి లవ్ ట్రాక్ ప్రజెంట్ జనరేషన్ యూత్, సోషల్ మీడియాలో బతికే అమ్మాయిలను రిప్రజెంట్ చేసేలా ఉంటుంది. ఆ సన్నివేశాలు టీనేజ్ ఆడియన్స్‌కు నచ్చుతాయి. మిగతా వాళ్లకు అతిగా అనిపిస్తాయి. ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’లో ప్లస్, మైనస్ కామెడీయే.
కళ్యాణ్ నాయక్ పాటలు బావున్నాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ బాణీ, చిత్రీకరణ బావుంది. మిగతా పాటలు ఓకే. నేపథ్య సంగీతం సైతం కామెడీ సన్నివేశాలు తగ్గట్టు ఉంది. కెమెరా వర్క్ ఓకే. ఎడిటర్ బొంతల నాగేశ్వరరావు వర్క్ కామెడీకి హెల్ప్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో ఎడిటింగ్ కట్స్ వల్ల కామెడీ వర్కవుట్ అయ్యింది. నిర్మాణ విలువలు బావున్నాయి. కథకు తగ్గట్టు ఖర్చు చేశారు. తబితా సుకుమార్ సమర్పణ వల్ల సినిమాకు మంచి ప్రచారం దక్కింది.
రావు రమేష్ ఆల్ రౌండర్. కామెడీ, ఎమోషన్స్… డిఫరెంట్ వేరియేషన్స్ చూపించే అవకాశం లభించడంతో సుబ్రమణ్యం పాత్రలో చెలరేగిపోయారు. మరీ ముఖ్యంగా కామెడీలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించారు. ఆయన డైలాగ్ డెలివరీలో ఛేంజ్ చూపించారు. ఆయన భార్యగా ఇంద్రజ నటనలో హుందాతనం ఉంది. అంకిత్ కొయ్య, రావు రమేష్ కాంబినేషన్ సన్నివేశాలు, కామెడీలో వాళ్లిద్దరి కెమిస్ట్రీ భలే కుదిరింది. సన్నివేశాల్లో రమ్య పసుపులేటి క్యూట్, బబ్లీగా కనిపించారు. పాటల్లో గ్లామర్‌గా ఉన్నారు. హర్షవర్ధన్, బిందు, శివన్నారాయణ, ప్రవీణ్, అన్నపూర్ణమ్మ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నవ్వించారు.
కామెడీ కోసం, కాసేపు హాయిగా నవ్వుకోడం కోసం చూడాల్సిన సినిమా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’. కథ, కథనం, లాజిక్స్ గురించి ఆలోచిస్తే కష్టం. అవి పక్కన పెట్టేసి… ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే రావు రమేష్ నటనను ఫుల్లుగా ఎంజాయ్ చేయవచ్చు.
మరిన్ని చూడండి