Nagarjuna: ఈసారి సంక్రాంతి రేసులోకి సీనియర్ హీరో నాగార్జున కూడా ఉన్నారు. ‘నా సామిరంగ’తో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. టాలీవుడ్‌లో ఫేమస్ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ బిన్నీ.. ఈ మూవీతో దర్శకుడిగా మారాడు. ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో మూవీ టీమ్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి అందించిన పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ‘నా సామిరంగ’ విశేషాలను పంచుకోవడానికి నాగార్జున.. ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సంక్రాంతికి జరిగే కథ..
ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకోవడంతో ‘నా సామిరంగ’ మూవీ షూటింగ్ త్వరగా పూర్తయిందని నాగార్జున తెలిపారు. కీరవాణి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉండడం తమ అదృష్టమని మరోసారి తెలిపారు. తమ సినిమాకి కీరవాణే స్టార్ అన్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా ‘నా సామిరంగ’కు కీరవాణి పడిన కష్టాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మూవీలో అన్ని ఎమోషన్స్ ఉంటాయని హామీ ఇచ్చారు. ఇది భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో జరిగే కథ అని రివీల్ చేశారు. అందుకే సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇది ఒక మలయాళ మూవీ అయినా కూడా దాని రీమేక్‌లో ఏ మాత్రం సోల్ మిస్ అవ్వకుండా విజయ్ బిన్నీ తెరకెక్కించాడని నాగార్జున క్రెడిట్ ఇచ్చారు.
డిఫరెంట్ ప్రేమ కథ..
‘నా సామిరంగ’ అనేది విలేజ్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా ఇందులో చాలా టిపికల్ లవ్ స్టొరీ ఉందని నాగార్జున అన్నారు. తాను కిష్టయ్య పాత్రలో కనిపించగా.. హీరోయిన్‌కు, తనకు మధ్య 12 ఏళ్ళ నుంచి ఒక ప్రేమకథ నడుస్తుందని ట్రైలర్‌లో చెప్పిన విషయాన్నే మరోసారి బయటపెట్టారు. ముఫ్ఫై ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పరిచయమయ్యి మాట్లాడకుండానే వాళ్ళ ప్రేమకథ నడుస్తుందని అన్నారు. ఇది చాలా డిఫరెంట్ లవ్ స్టొరీ అని, ఇందులో అషికా బాగా నటించిందని ప్రశంసించారు. విజయ్ బిన్నీకు కొరియోగ్రాఫర్‌లాగా పాటలోనే మంచి కథని చెప్పే నేర్పు తనలో ఉందని అన్నారు. అది తనకు చాలా నచ్చిందని, చాలా క్లారిటీ ఉన్న దర్శకుడని తెలిపారు.
నాగేశ్వర్ రావు పాటతో టైటిల్..
విజయ్ బిన్నీని దర్శకుడిగా అనుకోకముందే అల్లరి నరేష్ పాత్రని ఫిక్స్ అయ్యామని నాగార్జున బయటపెట్టారు. ఆ పాత్రకు అల్లరి నరేష్ కరెక్ట్‌గా సూట్ అవుతారనిపించిందని అన్నారు. తనతో పాటు రాజ్ తరుణ్‌ది కూడా కథలో కీలకమైన పాత్ర అని తెలిపారు. నాగేశ్వర రావు పాటలో నుంచి వచ్చిన ‘నా సామిరంగ’ అనే టైటిల్ సినిమా మొత్తం వినిపిస్తూనే ఉంటుందని రివీల్ చేశారు. తన సినిమాలు అన్నింటిలో పోలిస్తే.. ‘నా సామిరంగ’ చాలా మాస్సీ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మహేశ్ బాబుతో మల్టీ స్టారర్ గురించి ప్రశ్నించగా.. ప్రస్తుతం రాజమౌళి సినిమాలో మహేశ్ బిజీగా ఉన్నారని, అది పూర్తయిన తర్వాత మల్టీ స్టారర్ గురించి ఆలోచించారని నవ్వుతూ తెలిపారు. ఇక శేఖర్ కమ్ములతో తరువాతి చిత్రం ఉండబోతుందని రివీల్ చేశారు.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన సింగర్ సునీత కొడుకు మూవీ – ‘సర్కారు నౌకరీ’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?