Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే దశాబ్ద కాలంగా సినీ అభిమానులను అలరిస్తోంది. ఓవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే, మరోవైపు కుర్ర హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదు. గత రెండేళ్లుగా తెలుగు తమిళ భాషల్లో అసలు సినిమాలే చేయలేదు. అందుకు ముందు చేసిన సినిమాలు కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి. దీంతో బాలీవుడ్ కు చెక్కేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పూర్తిగా హిందీ చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది.
గతేడాది సల్మాన్ ఖాన్ తో కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ అనే సినిమాతో పలకరించింది పూజా హెగ్డే. ఈ మూవీ ప్లాప్ అయినప్పటికీ అమ్మడికి హిందీలో మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సరసన ‘దేవా’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రోషన్ ఆండ్రూస్ ఈ యాక్షన్ థ్రిల్లర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే లేటెస్టుగా మరో హిందీ సినిమా ఆఫర్ పూజా చేతికి వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ప్రముఖ హిందీ నటుడు సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టి హీరోగా ‘సంకీ’ అనే సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్న చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు పూజా హెగ్డే పచ్చజెండా ఊపింది. ఇది భిన్నమైన ప్రేమకథా చిత్రమని తెలుస్తోంది. రజత్ అరోరా దీనికి కథ అందించారు. అద్నాన్ షేక్, యాసిర్ ఝా ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం కానున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2025 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
‘Rx 100’ రీమేక్ గా తెరకెక్కిన ‘తడప్’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు అహన్ శెట్టి. తెలుగులో హిట్టైన ఈ సినిమా హిందీలో ఆడలేదు. డెబ్యూ మూవీనే ప్లాప్ అవ్వడంతో కాస్త గ్యాప్ తీసుకున్న స్టార్ వారసుడు.. ఇప్పుడు సాజిద్ నడియాడ్‌వాలా ప్రొడక్షన్ లో ‘సంకీ’ సినిమా చేస్తున్నాడు. సినీ రంగంలో తనకన్నా చాలా సీనియర్ అయిన, ఐదేళ్లు పెద్దదైన పూజా హెగ్డేతో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు. పూజా ఇంతకముందు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో తనకన్నా తక్కువ వయసున్న అఖిల్ అక్కినేనికి జోడీగా నటించిన సంగతి తెలిసిందే.
‘మాస్క్’ అనే తమిళ్ మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన పూజా హెగ్డే.. ‘ఒక లైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు అందుకొని, కొన్నేళ్లపాటు టాప్ హీరోయిన్ గా రాణించింది. అయితే ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అమ్మడికి ఆశించిన విజయాలు అందడం లేదు. 2022లో చేసిన ‘ఆచార్య’, ‘బీస్ట్’, ‘రాధే శ్యామ్’, ‘సర్కస్’ లాంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి ప్లాప్ అయ్యాయి. ‘గుంటూరు కారం’ సినిమాలో మహేశ్ బాబుతో కలిసి ఒక షెడ్యూల్ షూటింగ్ చేసిన తర్వాత అనూహ్యంగా తప్పుకుంది. సాయి తేజ్ సరసన ‘గాంజా శంకర్’ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని అంటున్నారు కానీ, దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి పూజా క్రేజీ ఆఫర్ తో త్వరలోనే టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.
Also Read: అల్లు అర్జున్ VS శివరాజ్ కుమార్ – పుష్పరాజ్‌ను ఢీకొట్టబోతున్న ‘భైరతి రణగల్’
మరిన్ని చూడండి