Hitchcock Book Launch : ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ 125వ జయంతి, ఆయన తొలి సినిమా విడుదలై 100 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ అనే పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ – ఐఆర్ఎస్ అధికారి రవి పాడి కలిసి ఓ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బుక్ లో 45 మంది డైరెక్టర్స్, ఏడుగురు రచయితలు, పదిమంది జర్నలిస్టులు రాసిన 62 వ్యాసాలు ఉన్నాయి. హైదరాబాదులో ఈ బుక్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించగా, డైరెక్టర్ వంశీ, హరీష్ శంకర్, మెహర్ రమేష్, మోహనకృష్ణ ఇంద్రగంటి వంటి దర్శకుడు తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు వంశీ ఈ బుక్ ను ఆవిష్కరించి ఫస్ట్ కాపీని డైరెక్టర్ హరీష్ శంకర్ కు, సెకండ్ బుక్ ను సీనియర్ నటుడు నాజర్ కు అందజేశారు. ఈ బుక్ కవర్ పేజీని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత ఈశ్వర్ డిజైన్ చేయగా, ప్రముఖ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్ర గంటి బుక్ కవర్ పేజీ ఫ్రేమ్ ని ఆవిష్కరించారు.
‘అన్వేషణ’కు ప్రేరణ
ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ ‘అన్వేషణ సినిమా తీయడానికి నాకు ప్రేరణ హిచ్ కాక్. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు విసిఆర్ ను కొన్నప్పుడు, అందులో ‘సైకో’ సినిమాను చూసాను. హిచ్ కాక్ మొత్తం 53 సినిమాలు తీస్తే, అవన్నీ చూసాను నేను. పులగం చిన్నారాయణకు కూడా ఈ విషయాలు తెలుసు. సినిమాకు అవసరమైనవి మూడే మూడు… ఆ మూడు స్క్రిప్ట్ అని ఎప్పుడో చెప్పారు హిచ్ కాక్. ఇలాంటి గొప్ప వ్యక్తి మీద రవి పాడి, పులగం చిన్నారాయణ మంచి పుస్తకం తీసుకురావడం అద్భుతం. ఈ రచయితలు ఇద్దరూ నాకు సన్నిహితులే. ఈ పుస్తకం ఫస్ట్ కాపీని చూసి థ్రిల్ అయ్యాను. ఇప్పటిదాకా ఆయన మీద ఇలాంటి పుస్తకం తీసుకురావాలనే ఆలోచన, ప్రయత్నం భారతీయ భాషలో ఎవ్వరూ చేయలేదు. బుక్ అద్భుతంగా వచ్చింది” అని అన్నారు.
వాళ్ళు గంధర్వులతో సమానం
హరీష్ శంకర్ మాట్లాడుతూ “మనమందరం హిచ్ కాక్ సినిమాలు చూసాం కానీ ఆయనను చూడలేకపోవడం దురదృష్టం. అయితే వంశీ గారి సినిమాలతో పాటు ఆయనను కూడా చూడడం అదృష్టం. వంశీని చాలామంది ఆంధ్ర హిచ్ కాక్ అంటారు. కానీ నా దృష్టిలో మాత్రం ఆయన హాలీవుడ్ వంశీ హిచ్ కాక్. ఆయన నుంచి ఈ పుస్తకం ఫస్ట్ కాపీని అందుకోవడం నా పూర్వజన్మ సుకృతం. నేను కూడా ఈ బుక్ లో ఓ సినిమా గురించి రాశాను. అయితే ప్రస్తుతం యూట్యూబ్ షాట్స్, ఇన్స్టా రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో పుస్తకాలు వాళ్ళు చదివే వాళ్ళను గంధర్వులతో సమానం అంటాను. నిజంగా పుస్తకం రాసే వాళ్ళు దేవుళ్ళు.
పులగం చిన్నారాయణ ఎప్పుడు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడుతుంటారు. అందుకే ఆయన గత జన్మలో దర్శకుడు ఏమో అనిపిస్తుంది. వచ్చే జన్మలో ఆయన కచ్చితంగా డైరెక్టర్ అవుతారు. ఈ జన్మలో ఇప్పటికే కాంపిటీషన్ ఎక్కువైంది. సినిమా ఇండస్ట్రీపై, ఇండస్ట్రీలోని ప్రముఖులపై పులగం చిన్నారాయణ పుస్తకాలు తీసుకొస్తూ చేస్తున్న కృషికి, ప్రయత్నానికి నా సాష్టాంగ ప్రణామాలు. ఒక సినిమా సక్సెస్ అయితే సక్సెస్ మీట్ ఎలా పెడతామో ఈ బుక్ సక్సెస్ మీట్ ను కూడా అలాగే పెట్టాలని కోరుకుంటున్నాను. ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ బుక్ హైదరాబాద్ లో బెస్ట్ సెల్లర్ కావాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని చూడండి