Homeవినోదంకంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?

కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం – ‘కంగువా’ కనెక్ట్ అయిందా? – హిట్ కొట్టారా?


Kanguva Movie Review: కోలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన సూర్య తన ప్రైమ్ టైమ్‌లో రెండేళ్లకు పైగా సమయాన్ని ‘కంగువా’కు కేటాయించారు. ఈ భారీ బడ్జెట్ పీరియాడిక్ సినిమాపై కేవలం తమిళంలో మాత్రమే కాకుండా అన్ని భాషల్లో మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏకంగా ఒక భారీ స్ట్రయిట్ తెలుగు సినిమాకు వచ్చినంత క్రేజ్ వచ్చింది. విడుదల చేసిన రెండు ట్రైలర్లూ సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?

కథ: 2024లో ఒక ల్యాబ్ లో మనుషులపై ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ ల్యాబ్ నుంచి జీటా అనే కోడ్ నేమ్ ఉన్న ఒక టెస్ట్ సబ్జెక్ట్ తప్పించుకుంటాడు. మరో వైపు గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) బౌంటీ హంటర్స్ గా ఉంటారు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్ ని పట్టుకుని బౌంటీ తీసుకుంటూ ఉంటారు. ఏంజెలినాతో (దిశా పటానీ) ఫ్రాన్సిస్‌కు గతంలో ఒక లవ్ ట్రాక్ అవుతుంది. కానీ బ్రేకప్ అయ్యాక బద్ధశత్రువులుగా మారతారు. గోవాకు చేరుకున్న జీటా… ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్తాడు. ఫ్రాన్సిస్‌ కూడా జీటాను చూడగానే ఏదో కనెక్షన్ ఫీల్ అవుతాడు. ఇంతలో సడెన్‌గా జీటాను వెనక్కి తీసుకెళ్లడానికి ల్యాబ్ నుంచి కొందరు వస్తారు. ఫ్రాన్సిస్ వారితో పోరాడుతూ ఉండగా కథ క్రీస్తు శకం 1070కి షిఫ్ట్ అవుతుంది. అసలు జీటాకి, ఫ్రాన్సిస్‌కి ఏంటి సంబంధం? దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నివసించిన ఆదివాసీ నాయకుడు (కంగువా) ఎవరు? ఈ కథ ఎక్కడికి వెళ్లిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: మనం కన్న కల గొప్పగా ఉండటం అనేది ఎప్పుడూ తప్పు కాదు. కానీ ఆ కలని నిజం చేసేటప్పుడు తప్పులు దొర్లకుండా చూసుకోవడం ముఖ్యం. లేకపోతే ఆ కలకు అర్థం లేకుండా పోతుంది. ‘కంగువా’ అనేది శివ కన్న కల. ఆ కలను నిజం చేయడానికి ఆయన రెండు సంవత్సరాలు కష్టపడ్డారు. కేవలం శివ మాత్రమే కాదు సూర్య లాంటి స్టార్ హీరో తన కెరీర్‌లో రెండు సంవత్సరాలు శివ కన్న కలకు ఖర్చు పెట్టారు. ఇక స్టూడియో గ్రీన్ నిర్మాత జ్ఞానవేల్ రాజా వందల కోట్లు ఖర్చు పెట్టారు. మరి శివ కన్న ‘కంగువా’ అనే కలకు అర్థం ఉందా?

సినిమా ఫస్టాఫ్ చాలా పేలవంగా ప్రారంభం అవుతుంది. సూర్య తప్ప స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్లు అన్నీ విసిగిస్తూనే ఉంటాయి. యోగిబాబు, రెడిన్, దిశా పటానీ, కేఎస్ రవికుమార్… ఇలా స్క్రీన్‌పై ఎవరు కనిపించినా ఆడియన్స్‌లో చిరాకు మాత్రం ఆగదు. యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లే కామెడీ (అని మనం అనుకోవాలి) అస్సలు ఏమాత్రం పండలేదు. సీరియస్ సన్నివేశాల్లో కూడా కామెడీ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మొదటి 40 నిమిషాల్లో ఆడియన్స్‌ను విసిగించడానికి విరామం లేకుండా స్క్రీన్‌పై కనిపిస్తున్న అందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇది శివ మార్కు రెగ్యులర్ కమర్షియల్ సినిమా అని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోతున్న టైమ్‌లో… పీరియాడిక్ పోర్షన్ ప్రారంభం అవుతుంది.

ఇక్కడ శివ కన్న కల అర్థం అవ్వడం మొదలవుతుంది. టీమ్ పడ్డ కష్టం, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి… స్క్రీన్‌పై కనిపిస్తూ ఉంటాయి. సినిమాలో చూపించే ఐదు రకాల తెగల పెర్ఫార్మెన్స్ చాలా మొదట్లో లౌడ్‌గా అనిపిస్తుంది. కానీ ఆదివాసీ తెగలు, మనం ఇంతవరకూ చూడని మనుషులు కాబట్టి కథ ముందుకు నడిచే కొద్దీ ఆ లౌడ్ పెర్ఫార్మెన్స్‌కు కూడా ఆడియన్స్ అలవాటు పడిపోతారు. అలా అని స్క్రీన్ మీద కనిపించే నటులందరూ లౌడ్‌గా పెర్ఫార్మ్ చేయరు. రొమేనియన్ సామ్రాజ్యం నుంచి వచ్చిన వారి పాత్రల్లో కనిపించిన విదేశీ నటుల పెర్ఫార్మెన్స్ సెటిల్డ్‌గానే ఉంటుంది. కాబట్టి తెగల్లో కనిపించిన నటులతో కావాలనే లౌడ్‌గా చేయించారని అనుకోవాలి. ఒక ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

అసలైన ఎమోషనల్ కంటెంట్, వార్ ఎపిసోడ్లు అన్నీ సెకండాఫ్‌లోనే ఉంటాయి. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఎపిసోడ్లు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. మంచు కొండల్లో వచ్చే ఒక ఎపిసోడ్, ఆ తర్వాత అడవిలో వచ్చే సూర్య వర్సెస్ ఆర్మీ వార్ సీన్ అన్ని ఆడియన్స్‌కు మంచి హై ఇస్తాయి. ఒక ఎమోషనల్ బ్యాంగ్‌తో సినిమాను ఎండ్ చేస్తారు. ఇక క్లైమ్యాక్స్ తర్వాత మాత్రం రెండు ట్విస్టులతో సెకండ్ పార్ట్‌కు మంచి లీడ్ సెట్ చేశారు. చివర్లో వచ్చే క్యామియో, ఆ పాత్ర చేసిన నటుడు ఇద్దరూ సెకండ్ పార్ట్‌పై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేశారు. ఓవరాల్‌గా చూసుకుంటే పులావా అనే బాలుడు, కంగువా అనే యోధుడు కలిసి జన్మ జన్మల పాటు చేసే ఎమోషనల్ జర్నీనే ‘కంగువా’ కథ.

ఫస్టాఫ్‌పై మంచి కేర్ తీసుకుంటే ‘కంగువా’ చాలా గొప్ప సినిమా అయ్యేది. యోగిబాబు, రెడిన్… ఆఖరికి దిశా పటానీ కూడా కథకు అవసరం లేని క్యారెక్టరే. ఫస్టాఫ్‌లో సూర్య, దిశా పటానీ ఫ్లాష్‌బ్యాక్ లవ్ స్టోరీ పూర్తిగా ఎడిట్ చేసినా సినిమాకు ప్లస్ అయ్యేది. కథకు అవసరం లేకపోయినా స్క్రీన్‌పై ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయగలిగితే ఫ్లోలో వెళ్లిపోతాయి. కానీ వీరి సీన్లు ఎంగేజ్ చేయకపోగా విసిగిస్తాయి. కనీసం సెకండ్ పార్ట్‌లో అయినా (ఒకవేళ తీస్తే) శివ ఈ ట్రాక్‌ను వీలైనంత తగ్గించాలి.

ఒక కొత్త తరహా కథను తీస్తున్నామని ఆడియన్స్‌కు ప్రామిస్ చేసినప్పుడు పూర్తిగా కొత్తగా తీసి ఉంటే బాగుండేది. పీరియాడిక్ పోర్షన్‌లో ఈ సిన్సియారిటీ స్క్రీన్‌పై కనిపించినా… ప్రెజెంట్ టైమ్‌లో జరిగే స్టోరీ ఆ నమ్మకాన్ని దెబ్బ తీస్తుంది. కానీ క్లైమ్యాక్స్‌కు వచ్చేసరికి ప్రెజెంట్ పోర్షన్ కూడా ట్రాక్‌లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. విలన్‌గా బాబీ డియోల్ లుక్ డెడ్లీగా ఉన్నప్పటికీ… క్యారెక్టరైజేషన్‌లో ఆ క్రూరత్వం కనిపించదు. ఇక్కడ కూడా కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.

Also Read: హీరోయిన్ లేకుండానే తెరపైకి రాబోతున్న “మ్యాడ్ స్క్వేర్”.. కానీ టిల్లు గానీ పిల్లది మాత్రం స్పెషల్ రోల్

‘కంగువా’ అనేది దేవిశ్రీప్రసాద్‌కు కమ్‌బ్యాక్ సినిమా అని చెప్పాలి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్‌కు ఆడియన్స్ దగ్గర నుంచి అంత మంచి రెస్పాన్స్ రాకపోయినా సినిమాలో వచ్చే మాంటేజ్ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సీన్లకు దేవి ప్రాణం పోశారు. నాయకా, మన్నింపు, కంగ కంగ సాంగ్స్ స్క్రీన్‌పై చాలా ఆకట్టుకుంటాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే… ‘కంగువా’ అనేది సూర్య వన్ మ్యాన్ షో. నటుడిగా సూర్యని మరో 10 మెట్లు పైకి ఎక్కించే సినిమా. కంగువా, ఫ్రాన్సిస్ రెండు పాత్రలకు డిఫరెన్స్ కూడా చాలా బాగా చూపించాడు. సినిమాలో సూర్య తర్వాత అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్ర జీటా, పులావా పాత్రలు పోషించిన బాలుడిది. తన పెర్ఫార్మెన్స్‌తో ఇతను కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాడు. విలన్ పాత్రలో నటించిన బాబీ డియోల్‌కు తన స్థాయికి తగ్గ పాత్ర దొరకలేదు.

ఓవరాల్‌గా చెప్పాలంటే… పీరియాడిక్ పోర్షన్ మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఒక డీసెంట్ యాక్షన్, ఫాంటసీ డ్రామా చూడాలనుకుంటే ‘కంగువా’ను కచ్చితంగా ట్రై చేయవచ్చు.

Read Also: ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ ఫోటో లీక్ – అల్లు అర్జున్ తో శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు!

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments