Tollywood Actresses: సినిమాకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చే ఈరోజుల్లో, చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. అందం, అభినయం, టాలెంట్ తో పాటుగా ఆవకాయంత అదృష్టం కూడా కలిసొస్తేనే ఆఫర్స్ దక్కుతాయి. దీనికి సక్సెస్ కూడా తోడైతేనే కొన్నాళ్లపాటు స్టార్ గా రాణించగలుగుతారు. అయినప్పటికీ మేల్ డామినేషన్ ఉండే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కొన్నేళ్ళు మాత్రమే. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే.. సపోర్టింగ్ రోల్స్ కి షిఫ్ట్ కొట్టాల్సిందే. కానీ ప్రస్తుతం సౌత్ లో కొందరు ముద్దుగుమ్మలు నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా ఇప్పటికీ కథానాయికలుగా అవకాశాలు అనుకుంటున్నారు. ఇంకొందరు పెళ్ళి చేసుకుని పిల్లలకి జన్మనిచ్చినా కూడా హీరోయిన్ వేషాలు అందిపుచ్చుకుంటున్నారు.
త్రిష:
2002 లో ‘మౌనం పేసియాధే’ అనే తమిళ్ సినిమాలో తొలిసారిగా హీరోయిన్ గా నటించిన త్రిష కృష్ణన్.. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. 40 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ కుర్ర భామలకు పోటీగా నిలుస్తోంది. ఈ ఏడాదిలో ‘పొన్నియన్ సెల్వన్ 2’, ‘ది రోడ్’, ‘లియో’ వంటి చిత్రాల్లో కనిపించింది త్రిష. ఇప్పుడు ‘రామ్ పార్ట్ 1’ అనే మలయాళ మూవీతో పాటుగా ‘విదా మయార్చి’ అనే తమిళ్ సినిమా చేస్తోంది. లేటెస్టుగా కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది.
నయనతార:
2003లో ‘మనసునక్కరే’ అనే మలయాళ మూవీతో తెరంగేట్రం చేసిన నయనతార.. ఈ 20 ఏళ్లలో లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకునే స్థాయికి చేరుకుంది. 38 ఏళ్ల వయసులోనూ తన అందంతో ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది. పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూనే, వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. కెరీర్ ను పర్సనల్ లైఫ్ ను బ్యాలన్స్ చేసుకుంటూ వస్తోంది. ‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నయన్.. ఇటీవల ‘గాడ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ‘అన్నపూర్ణి’, ‘టెస్ట్’, ‘మన్నంగట్టి సిన్స్ 1960’, ‘తని ఒరువన్ 2’ వంటి తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.
తమన్నా భాటియా:
15 ఏళ్ల వయసులోనే తెరంగేట్రం చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. 2005లో ‘శ్రీ’ అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీ చిత్రాల్లో నటించింది. ఇన్నేళ్ల కెరీర్ తర్వాత కూడా ఇప్పటికీ మెయిన్ హీరోయిన్ గా ఛాన్సులు అందుకుంటోంది. ఇండస్ట్రీలోకి ఎంతమంది కొత్త కుర్ర హీరోయిన్ల వస్తున్నా, అమ్మడి జోరు మాత్రం తగ్గడం లేదు. ఓవైపు సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూనే, మరోవైపు కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తోంది. ఈ ఏడాది ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ వంటి వెబ్ సిరీస్ లతో అలరించిన తమన్నా.. ‘భోళా శంకర్’ సినిమాతో పలకరించింది. ‘జైలర్’ లో కావాలయ్యా అంటూ పాన్ ఇండియాని ఊపేసింది. రీసెంట్ గా ‘బంద్రా’ అనే మలయాళ మూవీతో మాలీవుడ్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ‘అరణ్మనై 4’, ‘వేద’ చిత్రాల్లో నటిస్తోంది.
అనుష్క శెట్టి:
‘సూపర్’ సినిమాతో 2005లో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అందాల అనుష్క శెట్టి.. గత 18 ఏళ్ల కాలంలో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో స్టార్ హీరోల రేంజ్ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. ఆమె ప్రస్తుత వయస్సు 42 సంవత్సరాలు. ఇప్పటికీ ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తూ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన స్వీటీ.. ప్రస్తుతం ‘కధన్ – ది వైల్డ్ సోర్సెరర్’ అనే మలయాళ పీరియాడిక్ యాక్షన్ మూవీలో నటిస్తోంది. త్వరలో తన కెరీర్ లో మైలురాయి 50వ చిత్రంగా ‘భాగమతి’కి సీక్వెల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
శృతి హాసన్:
2009లో ‘లక్’ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన శృతి హాసన్.. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో తెలుగు తెర మీదకు ఎంట్రీ ఇచ్చింది. తెలుగు తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇప్పుడు 37 ఏళ్ల వయసులోనూ కథానాయిక వేషాలు అందుకుంటోంది. ఓవైపు తన తండ్రి వయసున్న సూపర్ సీనియర్ హీరోలతో ఆడిపాడుతూనే, మరోవైపు స్టార్ హీరోలతో జోడీ కడుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన శ్రుతి.. ప్రస్తుతం ‘సలార్’ పార్ట్-1 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే ‘ది ఐ’ అనే ఇంగ్లీష్ మూవీ చేస్తోంది.
కాజల్ అగర్వాల్:
‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ కి వచ్చిన అందాల చందమామ కాజల్ అగర్వాల్.. అనతి కాలంలో స్టార్ స్టేటస్ అందుకుంది. కొన్నేళ్ల పాటుగా టాప్ పొజిషన్ లో కొనసాగింది. 2020లో వివాహ బంధంలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఓ బిడ్డకు జన్మనిచ్చి సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. అయితే ఇటీవల ‘భగవంత్ కేసరి’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి, నటనకు పెళ్ళి పిల్లలు అడ్డంకి కాదని నిరూపించింది. ప్రస్తుతం ‘భారతీయుడు 2’ వంటి పాన్ ఇండియా మూవీతో పాటుగా ‘సత్యభామ’ అనే ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది కాజల్. అలానే మంజు వారియర్ లాంటి మరికొందరు ముదురు భామలు ఏజ్ తో సంబంధం లేకుండా కథానాయకి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు.
Also Read: చేతబడులు, క్షుద్ర పూజలు – హిట్ ఫార్ములా పట్టేసిన టాలీవుడ్ ఫిలిం మేకర్స్!