Rahu nakshtra transit: వైదిక జ్యోతిష్య శాస్త్రంలో రాహువుని అంతుచిక్కని గ్రహంగా భావిస్తారు. రాహు రాశి మార్పు, నక్షత్ర మార్పు ప్రేమ, వృత్తి, విద్య, వ్యాపారంలో సహా ప్రతి అంశంపై సానుకూల, ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. రాహువు గత ఏడాది నుంచి మీన రాశిలో సంచరిస్తున్నాడు.
మే 6వ తేదీ నుంచి రాహువు రేవతి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించాడు. జులై 8 వరకు రాహువు రేవతి నక్షత్రంలోనే ఉంటాడు. ఇది అందరిపై ప్రభావం చూపుతుంది. అంతుచిక్కని గ్రహమైన రాహువు కొన్ని రాశుల జీవితాల్లో అనేక సవాళ్లను పెంచుతాడు.
రేవతి నక్షత్ర ప్రభావం
రేవతి నక్షత్రం మొదటి పాదంపై బృహస్పతి ప్రభావం జ్ఞానం, ఆనందం, అదృష్టాన్ని తీసుకొస్తుంది. దీని ప్రభావంతో ఒక వ్యక్తి జీవితం అనేక మార్పులకు దారి తీస్తుంది. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మతపరమైన ఆచారాలను పాటించేందుకు ఆసక్తి చూపిస్తారు. తెలివితేటలతో ఏ పని అయినా చాలా చక్కగా, జాగ్రత్తగా పూర్తి చేస్తారు. అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఈ నక్షత్ర జాతకులకు ఉంటుంది.
రేవతి నక్షత్ర ప్రభావంతో ఉద్యోగంలో కష్టపడి పనులు చేస్తారు. తెలివిగా వివేకంతో వ్యవహరిస్తారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. సమాజంలో బాధ్యతాయుతంగా, ఇతరుల పట్ల ప్రేమను కనబరుస్తారు. ఆధ్యాత్మిక విషయాల్లో బలమైన ఆసక్తి, విశ్వాసం ఉంటాయి. జీవితంలోని సమస్యలను అధిగమించగలుగుతారు. ఆర్థిక కోణంలోను సంతోషంగా సమృద్ధిగా ఉంటారు. ఈ నక్షత్రం కింద జన్మించిన వాళ్ళు నిజాయితీగా ఉంటారు. ఏదైనా విషయాన్ని ఎక్కువ సేపు రహస్యంగా ఉంచలేరు. మనసులో ఏ విషయం దాచుకోలేరు.
రాహు సంచార ప్రభావం వీరికి శుభమే
రాహు ప్రభావం ఒక వ్యక్తిలోని శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, సంకల్ప శక్తిని మేల్కోలుపుతుంది. రేవతి నక్షత్రంలో రాహువు సంచారం వల్ల ఆధ్యాత్మిక పనుల్లో చురుకుగా ఉంటారు. జీవితంలో అనేక కొత్త విషయాలను అన్వేషిస్తారు. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యాపారులు అపారమైన విజయం సాధిస్తారు. అయితే మరికొందరికి మాత్రం పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మానసికంగా ధృడంగా ఉంటాడు.
రేవతి నక్షత్రంలో రాహువు ఉండటం వల్ల మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశి వారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీ లక్ష్యాలని సాధించడానికి మీరు చేసే కృషి ప్రశంసనీయంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు. సవాళ్ళు ఉన్నప్పటికీ మీరు జీవితంలోని ప్రతి రంగంలో అపారమైన విజయాన్ని సాధిస్తారు.
వృషభం, సింహం, వృశ్చిక రాశి, కుంభ రాశుల వారి కెరీర్ గురించి ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లాభాలకు కొత్త మార్గాలు సుగమం అవుతాయి. శారీరక సౌకర్యాలు పెరుగుతాయి.
ఈ రాశుల వారు జాగ్రత్త
మేషం, కర్కాటకం, తుల, మకర రాశి వారి జీవితంలో అనేక మార్పులు ఉంటాయి. మాటల మీద నియంత్రణ ఉంచుకోవాలి. లేదంటే ఇతరుల దగ్గర నోరు జారి మాట అంటే వెనక్కి తీసుకోలేరు. మీ మాటల వల్ల ఎదుటి వాళ్ళు బాధపడతారు. రాబోయే రోజుల్లో సవాళ్ళు పెరుగుతాయి. జీవితంలో సమతుల్యత పాటించాలి. మీ కలలు సాకారం చేసుకోవడానికి కష్టపడండి. ప్రతికూల ఆలోచనలు మనసుని ఎక్కువగా డామినేట్ చేస్తాయి.