Bhavagad gita shlokalu: భారతీయ ఇతిహాసం మహాభారతంలోని ఒక భాగం భగవద్గీత. ఒక మనిషి ఎలా ఉండాలి, ఉండకూడదు అనేది భగవద్గీతలో చాలా స్పష్టంగా వివరించారు. ఇందులోనే అనేక పాఠాలు, బోధనలు ప్రతి ఒక్కరు అవలభించాల్సిన సూత్రాలు.
శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి బోధించిన సారాంశమే ఈ భగవద్గీత. ఇందులోని అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తివంతమైన ఐదు శ్లోకాలు వాటి అర్థాలు ఏంటో తెలుసుకుందాం. ఇవి తెలుసుకున్నారంటే ఒక మనిషి ఎలా జీవించాలో తెలుస్తుంది.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
ఇది ప్రతి ఒక్కరు సులభంగా పఠించగలిగేటువంటి శ్లోకం. ఒక వ్యక్తి తాను నిర్వహించాల్సిన విధులను తప్పనిసరిగా నిర్వహించాలి కానీ ఆ చర్యలకు ఫలాలను పొందే అర్హత కలిగి ఉండడు అని దీని అర్థం. భగవద్గీతలోని శక్తివంతమైన ప్రసిద్ధ శ్లోకం ఇది. నిర్దిష్ట చర్యల వల్ల మనకు కలిగే ఫలితాలు, లాభాలపై దృష్టి పెట్టడం కంటే మనకున్న బాధ్యతలు చర్యలపై దృష్టి పెట్టాలని ఇది సూచిస్తుంది. ప్రజలు ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో పనిచేయమని ఈ శ్లోకం ప్రోత్సహిస్తుంది. ఏ పనైనా ఎటువంటి ఫలితం ఆశించకుండా చేయాలని సూచించబడుతుంది.
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే
ఈ శ్లోకాన్ని ఉచ్చరించడం కాస్త కష్టమైనప్పటికీ చాలా శక్తివంతమైన అర్ధాన్ని కలిగి ఉండే శ్లోకం ఇది. ఉనికిలో ఉన్న ప్రతి ఒక్కటి నా నుంచి ఉద్భవించిన ఆధ్యాత్మిక భౌతికపరమైన వాళ్ళే అని దీని అర్థం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్వయంగా భూమిపై అన్ని రకాల జీవులకు తానే కారణమని పేర్కొన్నాడు. తన దైవిక సర్వశక్తి గురించి నొక్కి చెప్పడం దీని అర్థం. విశ్వంలోనే ప్రతిదీ అతని నుండే ఉద్భవించిందని ప్రజలకు గుర్తు చేయడం ఈ శ్లోకం పరమార్థం.
అహమాత్మా గుడాకేశ సర్వభూతశయస్థిత్:
ఈ శ్లోకం కూడా ఎక్కువ మంది వినే ఉంటారు. నేను అన్ని జీవుల హృదయాలలో ఉన్నాను, వారి హృదయాలలో నివసిస్తుంటానని దీని అర్థం. అంటే మన హృదయంలో దేవుడు ఉన్నాడని మనం గుర్తించాలి. అది ఆత్మగా అయినా భౌతికంగా అయినా, మన చుట్టూ ఉన్న ఉనికికి దర్శనంగా భావిస్తారు. ఈ శ్లోకం అన్ని జీవులలో ఉన్న దైవశక్తి పవిత్రతను చాటి చెబుతుంది.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్! అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
భగవద్గీతలోని అత్యంత ప్రసిద్ధ శ్లోకాలలో ఇది ఒకటి. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఈ శ్లోకం గురించి తెలుసు. “ధర్మం క్షీణించినప్పుడు, దుష్టులు పెరిగినప్పుడల్లా దాన్ని నిర్మూలించడం కోసం నేను భూమిపై రూపాన్ని ఎత్తుతాను” అని దీని అర్థం. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి నైతికత, నీతి స్వభావం క్షీణించినప్పుడు, అధర్మం రాజ్యమేలినప్పుడు, భూమిపై ఏదైనా అన్యాయం జరిగినప్పుడు తాను తిరిగి వచ్చి ధర్మాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇవ్వడం.
క్రోధాద్భవతి సమ్మోహ: సమ్మోహాత్స్మృతివిభ్రమ: | స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి
కోపం వల్ల వచ్చే ప్రతికూల శక్తి గురించి వివరించే శ్లోకం ఇది. కోపం నుండి మాయ వస్తుంది, మాయ నుండి ఆలోచించే శక్తి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి అస్తవ్యస్తమైనప్పుడు మేధస్సు తగ్గిపోతుంది. అంటే ఆలోచన విధానం క్షీణిస్తుంది. కోపంలో వినాశన శక్తి ఉన్నందున ఆ కోపం ఒక మాయగా మారిపోతుంది. హేతుబద్ధమైన ఆలోచనలు కోల్పోతారు. అందుకే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయని చెబుతారు.