NEET-UG 2024: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ 2024 (NEET-UG 2024) లో పేపర్ లీకేజీలు, ఇతర అవకతవకలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు జూలై 18కి వాయిదా వేసింది. కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దాఖలు చేసిన అఫిడవిట్లు కొన్ని పక్షాలకు అందలేదని, అలాగే, ఈ కేసును, ఈ కేసులో వివిధ పక్షాలు సమర్పించిన అఫిడవిట్లను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. దాంతో, ఈ కేసు విచారణ ఈ నెల 18వ తేదీకి వాయిదా పడింది. సుప్రీంకోర్టు జూలై 8న ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్రం, ఎన్టీఏ తమ అఫిడవిట్లను దాఖలు చేశాయని ధర్మాసనం పేర్కొంది.