Republic Day 2025 – Tableaux : భారతదేశంలో జనవరి 26న నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్ లో ఎప్పటిలాగే పలు రాష్ట్రాలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సారి పరేడ్ లో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలతో పాటు 10 కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శనలో పాల్గొననున్నాయి. ఇవి భారతదేశ సాంస్కృతిక వారసత్వం, విజయాలను ప్రతిబింబిస్తాయి. అయితే ఈ సారి అత్యంత ఎక్కువ, స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. ప్రయాగ్ రాజ్ లో సాగుతోన్న మహా కుంభమేళా, గుజరాత్ లోని ఐక్యతా విగ్రహం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన లఖపతి దీదీ నేపథ్యంతో రూపొందించిన శకటాలు మరింత ఆకట్టుకోనున్నాయి.
సాంస్కృతిక ప్రాముఖ్యతను నొక్కి చేప్పే మహా కుంభ్ శకటం
ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన పండుగల్లో ఒకటి మహా కుంభమేళా. ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పే ఈ వేడుకలు జనవరి 13 నుంచి ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమయ్యాయి. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసిన పవిత్ర త్రివేణీ సంగమంలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు, సాధువులు, సన్యాసులు స్నానాలాచరిస్తున్నారు. గొప్ప చరిత్ర గల మహా కుంభమేళా థీమ్ తో రూపొందించిన శకటాన్ని ఈ సారి ఉత్తరప్రదేశ్ రిపబ్లిక్ పరేడ్ లో ప్రదర్శించనుంది.
ప్రోగ్రెస్ అండ్ ఇన్నోవేషన్ థీమ్ తో శకటం ప్రదర్శన
చారిత్రక వైభవాన్ని చాటుతూ, రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక పురోగతిని ప్రతిబింబించేలా గుజరాత్ రాష్ట్రం ఈ సారి సరికొత్త శకటంతో అలరించనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం, సర్దార్ వల్లభభాయ్ పటేల్ గౌరవార్థం నిర్మించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీతో పాటు సెమీ కండక్టర్, ఏరోస్పేస్ తో సహా అత్యాధునిక పరిశ్రమలలో, ముఖ్యంగా సీ – 295 విమానాల ఉత్పత్తిలో సహకారాన్ని గుజరాత్ శకటం రూపంలో ప్రదర్శించనుంది.
లఖపతి దీదీతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రదర్శన
ఈ సారి రిపబ్లిక్ పరేడ్ లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రదర్శన మరింత ఆకట్టుకోనున్నట్టు తెలుస్తోంది. లఖపతి దీదీని సెలబ్రేట్ చేసుకునే హృదయాన్ని కదిలించే శకటాన్ని తయారు చేసినట్టు సమాచారం. ఇది స్వయం సహాయక బృందాల సాయంతో ఆర్థిక స్వాతంత్ర్యం సాధించిన గ్రామీణ మహిళలను సూచిస్తుంది. హస్త కళలు, పాడి పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ వంటి ప్రభుత్వ కార్యక్రమాల విజయాలను ప్రదర్శించేలా శకటాన్ని నిర్మించారు.
వీటితో పాటు భారతదేశ వైవిధ్యం, పురోగతిని చూపే అనేక శకటాలు ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా వంటి రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రత్యేక వారసత్వ, సంస్కృతి సంప్రదాయాలను వర్ణించే శకటాలను రూపొందించినట్టు సమాచారం. రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత జనవరి చివరి వారం వరకు సాగే భారత్ పర్వ్ లో భాగంగా ఎర్రకోట వద్ద అనేక శకటాలు ప్రదర్శింపబడతాయి.
మరిన్ని చూడండి