UP Women Commission Key Proposals: మహిళలను ‘బ్యాడ్ టచ్’ నుంచి రక్షించడం సహా పురుషుల దురుద్దేశాలను నివారించేలా ఉత్తరప్రదేశ్ మహిళల కమిషన్ (Uttarapradesh Women’s Commission) కీలక ప్రతిపాదనలు చేసింది. పురుష టైలర్స్.. మహిళల దుస్తుల కొలతలను తీసుకోకూడదని, అలాగే అమ్మాయిల శిరోజాలను కత్తిరించే పనులు కూడా చేయకూడదని ప్రదిపాదించింది. ఈ మేరకు మహిళా కమిషన్ సభ్యురాలు హిమానీ అగర్వాల్ వెల్లడించారు. ఇటీవల జరిగిన సమావేశంలో కమిషన్ ఈ ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. ‘ఇలాంటి వృత్తుల్లో ఉన్న పురుషులు.. అమ్మాయిలను అసభ్యంగా తాకుతూ వేధించేందుకు ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వాటి నుంచి మహిళలను రక్షించేందుకు ఈ ప్రతిపాదనలు చేశాం.’ అని పేర్కొన్నారు.
మరిన్ని ప్రతిపాదనలు
- అమ్మాయిల దుస్తుల కొలతలు మహిళలు మాత్రమే తీసుకోవాలి. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
- అటు, సెలూన్లలో మహిళా కస్టమర్లకు అమ్మాయిలే సేవలందించాలి.
- జిమ్, యోగా సెంటర్లలో అమ్మాయిలకు మహిళా ట్రైనర్లే ఉండాలి. అలాంటి జిమ్‌లను తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయాలి.
- స్కూల్ బస్సుల్లో తప్పనిసరిగా మహిళా ఆయా లేదా ఉపాధ్యాయిని ఉండాలి. డ్రామా ఆర్ట్ సెంటర్లలో అమ్మాయిలకు మహిళా డ్యాన్స్ టీచర్లను ఏర్పాటు చేయాలి.
- మహిళల వస్తువులను విక్రయించే దుకాణాల్లో తప్పనిసరిగా మహిళా సిబ్బందే ఉండాలి. కోచింగ్ సెంటర్లలోనూ సీసీ టీవీలు ఏర్పాటు చేయాలి.
అయితే, ప్రస్తుతం తాము ప్రతిపాదనలు మాత్రమే చేశామని.. త్వరలోనే వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు కమిషన్ సభ్యురాలు హిమానీ అగర్వాల్ తెలిపారు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు చట్టం తీసుకొచ్చేలా యూపీ ప్రభుత్వాన్ని (UP Government) కోరనున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని చూడండి