Maharashtra Assembly Election 2024: మహారాష్ట్ర డీజీపీగా రష్మీ శుక్లాను ఎన్నికల సంఘం తప్పించింది. రష్మీ శుక్లాను బదిలీ చేయాలని కాంగ్రెస్ సహా మహావికాస్ అఘాడి నేతలు ఆమెపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు చేశారు. నిరంతరం ఆమె పని తీరుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వారి డిమాండ్ ఫలించింది.
అన్నింటినీ పరిశీలించిన ఎన్నికల సంఘం శుక్లాను విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రేపు (నవంబర్ 5) మధ్యాహ్నం 1 గంటలోపు ముగ్గురు సీనియర్ పోలీసు అధికారుల పేర్లు పంపించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించింది. అంతకంటే ముందు ముంబై పోలీసు కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్‌కు తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ఎంపిక చేయనున్నారు.
రష్మీ శుక్లాపై పలు ఆరోపణలు
రష్మీ శుక్లా సర్వీస్ జూన్ 2024తో ముగిసినప్పటికీ, బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జనవరి 2026 వరకు ఆమె పదవీకాలం పొడిగించారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే ఆరోపించారు. రష్మీ శుక్లా పని తీరు చాలా వివాదాస్పదంగా ఉందని, ఆమె చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేశారని, ప్రతిపక్షాల నాయకులను బెదిరించారని నానా పటోలే ఆరోపించారు.
ఎన్నికల సంఘం నుంచి బదిలీ ఉత్తర్వులు
నానా పటోలే, కాంగ్రెస్ అభ్యంతరం తర్వాత ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగానే రష్మీ శుక్లాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
సీనియర్ అధికారికి బాధ్యతలు
మహావికాస్ అఘాడి అభ్యంతరాలతో రష్మీ శుక్లాను బదిలీ చేసిన ఎన్నికల సంఘం తక్షణమే ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొంది. రష్మీ శుక్లాను బదిలీ చేసిన తర్వాత అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవిని అప్పగించాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
రష్మీ శుక్లా ఎవరు?
రష్మీ శుక్లా 1988 బ్యాచ్ IPS అధికారి. మహారాష్ట్ర పోలీస్‌లో అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఆమె ఒకరు. అంతకుముందు ఆమె సశాస్త్ర సీమా బల్ (SSB) సెంటర్ చీఫ్‌గా పనిచేశారు. పూణే పోలీస్ కమిషనర్‌గా కూడా ఉన్నారు. శుక్లా బదిలీ తర్వాత ఆమెకు ఏ శాఖ కేటాయిస్తారనే ఆసక్తి నెలకొంది. రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బాధ్యత ఎవరికి ఇస్తారనే సస్పెన్స్ కూడా సాగుతోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పేరు
మహారాష్ట్ర ఫోన్ ట్యాపింగ్ కేసులో రష్మీ శుక్లా పేరు వెలుగులోకి వచ్చింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. ఈ కేసులో రష్మీ శుక్లాపై ఆరోపణలు వచ్చాయి. ఆమె విచారణ కూడా ఎదుర్కొన్నారు. మంత్రులు, నేతల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్‌గా ఉన్న టైంలో శుక్లా సంజయ్ రౌత్, నానా పటోలే సహా మహావికాస్ అఘాడీకి చెందిన ముఖ్యమైన నాయకుల ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్
ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ స్వాగతించారు. “డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రష్మీ శుక్లాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మహాకూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని తేలింది. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారిణి రష్మీ శుక్లా పదవీకాలాన్ని పొడిగించాలని మహాకూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయడం ఏమిటి? మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా జరగకుండా చూసేందుకు ప్రభుత్వం పొడిగింపు ఇచ్చింది. రాజ్యాంగ విరుద్ధంగా వచ్చిన ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా అధికారులను పదవుల్లో కూర్చోబెట్టిందనే విషయం తేలిపోయింది. ఈ సమయంలో మహాకూటమి ప్రభుత్వం తమకు నచ్చిన అధికారులకు పొడిగింపు ఇచ్చి అధికారాన్ని దుర్వినియోగం చేసిందని వడ్డెట్టివార్ సంచలన ఆరోపణ చేశారు.
Also Read: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- లోయలో బస్ పడి 28 మంది మృతి
మరిన్ని చూడండి