UP Man Complaint To Police Over Missing Potatoes: అది దీపావళి ముందురోజు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇంతలో వారికి తమ ఇంట్లో దొంగతనం జరిగిందంటూ ఓ వ్యక్తి కాల్ చేశాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతని ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అతను చెప్పింది విన్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. తన ఇంట్లో పావుకిలో బంగాళదుంపలు పోయాయని.. అసలే వంట కోసం వాటిని ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టానని చెప్పాడు. తాను మందు తాగి వచ్చేసరికి వాటిని ఎవరో దొంగిలించారని దొంగను పట్టుకుని వాటిని తనకు ఇప్పించాలని హల్చల్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని (UP Police) పోలీసులకు తాజాగా ఓ వింత కేసు వచ్చింది. అక్టోబర్ 30వ తేదీన ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్ 112కి ఓ కాల్ వచ్చింది. హర్దోయ్ జిల్లా మన్నపుర్వాలోని విజయ్‌వర్మ అనే వ్యక్తి వారికి ఫోన్ చేసి తన ఇంట్లో చోరీ జరిగిందని ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఏమేం పోయాయని ప్రశ్నించారు.?. ఈ క్రమంలో అతను చెప్పిన సమాధానం విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తన ఇంట్లో తాను పొట్టు తీసి పెట్టుకున్న పావుకిలో ఆలుగడ్డలు పోయాయని చెప్పాడు. దీంతో కంగుతిన్న పోలీసులు ‘ఏంటీ తాగున్నావా.?’ అంటూ నిలదీశారు. దానికి అవునని సమాధానం చెప్పిన విజయ్‌వర్మ.. ‘రోజంతా కష్టపడి సాయంత్రం పూట ఓ పెగ్గు వేసుకున్నా. ఆ తర్వాత వంట చేసుకోవడానికి ఆలుగడ్డలను ఉడకబెట్టి.. పొట్టు కూడా తీసి ఉంచాను. వెంటనే వాటిని వెతికి పట్టుకురావాలి.’ అంటూ పోలీసులను దబాయించాడు. అంతా విన్న పోలీసులు సదరు మందుబాబుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి పిచ్చి ఫిర్యాదులు చెయ్యొద్దని హెచ్చరించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
మరిన్ని చూడండి