Term Insurance For Women: ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో టర్మ్ ఇన్సూరెన్స్‌ది కీలక పాత్ర. దీర్ఘకాలం కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన ఇటీవల జరిగిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. మహిళల్లో లైఫ్ ఇన్సూరెన్స్‌కు ఆదరణ పెరుగుతోందట. ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేస్తున్నారని తేలింది.
అధిక కవర్‌తో పాలసీల ఎంపిక
జీవిత బీమాకు సంబంధించిన ఆన్‌లైన్ సేవలను అందించే ప్లాట్‌ఫామ్ పాలసీబజార్ ఈ కొత్త రిపోర్ట్‌ను తయారు చేసింది. పాలసీబజార్ డేటా ప్రకారం, గత రెండేళ్లలో మహిళలు కొనుగోలు చేసిన టర్మ్ ప్లాన్‌ల సంఖ్య ఏకంగా 80 శాతం పెరిగింది. అదే కాలంలో, అధిక కవరేజ్‌తో కూడిన పాలసీల కొనుగోళ్లు కూడా 120 శాతం జంప్ చేశాయి. అంటే, ఇప్పుడు మహిళల్లో ఎక్కువ మంది జీవిత బీమాను కొనుగోలు చేయడమే కాకుండా, అధిక కవరేజీ ఉన్న పాలసీలను ఎంచుకుంటున్నారు.
మహిళల కొనుగోళ్లు పెరగడానికి కారణం
మహిళల పేరిట టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోళ్లు పెరగడానికి ప్రధాన కారణం.. ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లాన్‌లో వారి పాత్ర పెరగడం. వర్కింగ్ ఉమన్ అయినా, హోమ్ మేకర్ అయినా, కుటుంబ ఆర్థిక ప్రణాళికలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా, ఉద్యోగాలు చేసే లేడీస్ ఇంటి పనులను చక్కబెట్టడమే కాదు, బయటి వెళ్లి కూడా తమ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గణాంకాలు కూడా ఇదే నిజమని చెబుతున్నాయి. ఉద్యోగం కోసం గడప దాటుతున్నారు కాబట్టి, తాము లేకపోయినా కుటుంబానికి ఇబ్బంది ఉండకూడదని ఆలోచిస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేయడంలో వర్కింగ్ ఉమెన్‌దే అత్యధిక వాటా. దేశంలోని మహిళలు కొంటున్న మొత్తం పాలసీల్లో… పని చేసే మహిళలే 55-60 శాతం పాలసీలు కొనుగోలు చేస్తున్నారు.
టాప్-5 సిటీస్
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో వర్కింగ్ మహిళలు ముందున్నారు, వీలైనంత ఎక్కువ కవర్‌ను కూడా ఎంచుకుంటున్నారు. ఆర్థిక భవిష్యత్తు గురించి ఆలోచించడం ద్వారా ఎక్కువ కవరేజ్ తీసుకుంటున్నారు. 2022 నుంచి ఇప్పటి వరకు చూస్తే… రూ. 2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ కవర్ మొత్తంతో టర్మ్ ప్లాన్‌లను కొనుగోలు చేసే ట్రెండ్ దాదాపు రెట్టింపు అయింది. నగరాల వారీగా చూస్తే… దిల్లీ నుంచి గరిష్ట సంఖ్యలో మహిళలు (8-10 శాతం) టర్మ్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ (6-7 శాతం), బెంగళూరు (6-7 శాతం), ముంబై (4-5 శాతం), గుంటూరు (4-5 శాతం) వంటి నగరాలు ఉన్నాయి.
పాలసీతో పాటు తీసుకోవాల్సిన రైడర్
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో మహిళల గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, జీవిత బీమాతో సరిపెట్టకుండా తీవ్రమైన అనారోగ్యాలకు కూడా తగిన కవరేజ్‌తో రైడర్ తీసుకోవాలని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ కేసుల దృష్ట్యా, వివిధ బీమా కంపెనీలు రొమ్ము క్యాన్సర్ (breast cancer), అండాశయ క్యాన్సర్ (ovarian cancer), గర్భాశయ క్యాన్సర్‌ను (cervical cancer) వంటివాటిని కూడా ‘క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్’లో చేర్చాయి. చాలా బీమా కంపెనీలు ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేకమైన ఆరోగ్య నిర్వహణ సేవలను కూడా అందిస్తున్నాయి. టెలి-OPD కన్సల్టేషన్స్, మధుమేహం (diabetes), థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్, కాల్షియం సీరం, రక్త పరీక్షల వంటి సర్వీసులను కవర్ చేస్తున్నాయి. ఈ సేవలకు సంవత్సరానికి రూ. 36,500 వరకు ప్రయోజనం దక్కుతోంది.
మరో ఆసక్తికర కథనం: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?