Woman Commanding Officer In Indian Navy: చరిత్రలో నిలిచిపోయేలా ఇండియన్ నేవీ (Indian Navy)లో శుక్రవారం చారిత్రాత్మక ఘట్టం జరిగింది. నౌకాదళంలో తొలి మహిళా కమాండింగ్ అధికారి (First Woman Commanding Officer)ని నియమించినట్లు నావికాదళ చీఫ్ (Chief Of The Naval Staff) అడ్మిరల్ హరి కుమార్ (Admiral Hari Kumar) శుక్రవారం తెలిపారు. నేవీ డేకి ముందు జరిగిన విలేకరుల సమావేశంలో అడ్మిరల్ కుమార్ మాట్లాడుతూ.. అన్ని పదవులు – అన్ని ర్యాంకులు అనే నినాదం స్ఫూర్తితో భారత నౌకా దళానికి చెందిన నౌకలో తొలి మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు చెప్పారు. అగ్నిపథ్ పథకం (Agnipath Scheme) ఉద్యోగాల నియామకాల్లో చారిత్రాత్మక మార్పు అని అన్నారు.
మొదటి బ్యాచ్ అగ్నివీర్స్ ఈ సంవత్సరం మార్చిలో INS చిల్కా నుంచి పట్టభద్రులయ్యారని, వీరిలో 272 మంది మహిళా అగ్నివీర్ ట్రైనీలు కూడా ఉన్నారని అడ్మిరల్ తెలిపారు. అగ్నివీర్స్ రెండవ బ్యాచ్‌లో మొత్తం 454 మంది మహిళలు ఉన్నారని, మూడవ బ్యాచ్‌తో ఆ సంఖ్య 1,000 మందికి దాటిందని ఆయన చెప్పారు. చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్, సిబ్బందికి సేవలో అన్ని ర్యాంకులలో మహిళల మోహరింపుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
మొదటి మహిళా కమాండింగ్ అధికారిని కూడా నియమించామని, నావికాదళంలో పనిచేసే పురుషులు, మహిళలు వారి విధుల్ని నిబద్ధతతో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అడ్మిరల్ పేర్కొన్నారు. గత సంవత్సరాలతో పోలిస్తే 2023 మన దేశానికి గొప్ప సంవత్సరమని, ఆర్థిక రంగం, దౌత్యం, క్రీడా రంగాల్లో చెరగని ముద్ర వేసినట్లు చెప్పారు. అలాగే ఈ ఏడాది నావికాదళానికి కూడా విశేషమైనదని, ఈ కాలంలో, నౌకలు, జలాంతర్గాములు, విమానాలు సైనిక ఆపరేషన్లు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
దేశ భద్రత, ప్రయోజనాల కోసం హిందూ మహా సముద్ర జలాల్లో నావికాదళాలు నిరంతరం పనిచేస్తాయని, భారత నేవీ బృందాలు ఎప్పుడూ యుద్ధ సన్నద్ధతతో ఉంటాయని అన్నారు. హిందూ మహా సముద్రంలో చైనా కదలికల్ని భారత నావికాదళం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని, జాతీయ ప్రయోజనాల నిమిత్తం ఇండో – ఫసిఫిక్ ప్రాంతంలో సంతృప్తికర స్థాయిలో నౌకలను మొహరించినట్లు చెప్పారు.
అడ్మిరల్ మాట్లాడుతూ.. ఇండో-పసిఫిక్ ప్రాంతం అంతటా నౌకలు నిరంతరంగా తిరుగుతున్నాయని, ఒమన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియాలోని విదేశీ నౌకాశ్రయాలకు జలాంతర్గాములు వెళ్లాయని అన్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిగిన డేటా-స్థాయి కార్యాచరణ సంసిద్ధత వ్యాయామంలో, 151 కార్యాచరణ యూనిట్లు పాల్గొన్నాయని వివరించారు. భారత నావికాదళానికి చెందిన రెండు విమాన వాహక నౌకలు, విక్రాంత్, విక్రమాదిత్యలు కార్యకలాపాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో LCA నావికాదళం, MiG29K విక్రాంత్‌పై తొలి టేకాఫ్ ఎక్కువ సంతోషం కలిగించిందని అడ్మిరల్ కుమార్ అన్నారు. రక్షణ రంగంలో ‘ఆత్మ నిర్భర్త’ను పెంపొందించడంతో భారత నౌకాదళం సరైన మార్గంలో ఉందన్నారు. నూతన సాంకేతికను అభివృద్ధి చేయడం, నిధులను సద్వినియోగం చేసుకోవడంలో భారత్ సరికొత్త మార్గాలను వెతుకుతోందని చెప్పారు. మూలధన బడ్జెట్ రూ. 50,000 కోట్ల మార్క్‌ను దాటడం, ఆదాయ బడ్జెట్‌లో 26 శాతం పెరుగుదల ఉందని అడ్మిరల్ వెల్లడించారు.